అమరావతి, అక్టోబర్ 28: రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి పదో తరగతి చదువుతున్న విద్యార్ధులు రానున్న పబ్లిక్ పరీక్షల కోసం ఫీజు చెల్లింపులు సోమవారం (అక్టోబర్ 28) నుంచి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వ పరీక్షల విభాగం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. పరీక్ష ఫీజుల చెల్లింపులు నవంబరు 11వ తేదీలోపు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా చెల్లించాలని డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు. ఈలోపు కట్టలేకపోతే ఆలస్య రుసుముతో చెల్లించేందుకు వెసులుబాటు ఉంటుంది. రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్ 12వ తేదీ నుంచి నవంబరు 18 వరకు ఫీజు చెల్లించవచ్చు. అలాగే రూ.200 ఆలస్య రుసుముతో నవంబర్ 19 నుంచి 25 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో నవంబర్ 26 నుంచి నవంబరు 30 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పాఠశాల విద్యాశాఖ వివరించింది.
ఆన్‌లైన్‌లోనే పరీక్ష ఫీజు చెల్లించాలని, పాఠశాల లాగిన్ ద్వారా ప్రధానోపాధ్యాయులూ చెల్లించొచ్చని సూచించారు. రెగ్యులర్ విద్యార్థులు రూ.125, సప్లిమెంటరీ రాసేవారు మూడు సబ్జెక్టుల వరకు రూ.110, అంతకంటే ఎక్కువ ఉంటే రూ.125, వృత్తి విద్యా విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాలని తెలిపారు. వయసు తక్కువగా ఉండి పరీక్షలకు హాజరయ్యే వారు రూ.300, మైగ్రేషన్ సర్టిఫికెట్ అవసరమయ్యే వారు రూ.80 చెల్లించాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన డీఎస్సీ టీచర్ల జాయినింగ్ తేదీని నవంబర్ 10గా పరిగణించాలని ట్రెజరీస్ డైరెక్టర్ కేఎస్‌ఆర్ మూర్తిని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి కోరారు. ఈ మేరకు ట్రెజరీస్ డైరెక్టర్‌కు టీఎస్‌యూటీఎఫ్ వినతిపత్రం అందజేశారు. కొత్త టీచర్లకు నియామకపు తేదీలో ఇచ్చినట్లుగానే సర్వీస్ రిజిస్టర్‌లో నమోదు చేసుకోవచ్చని, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం నుంచి లేఖ వస్తే ఆవిధంగా వేతనాలు కూడా చెల్లించేలా ట్రెజరీలకు ఆదేశాలు ఇస్తామని డైరెక్టర్ చెప్పారన్నారు. ఇక గతంలో బదిలీ అయి, ఇటీవల రిలీవ్ అయిన ఉపాధ్యాయులకు అక్టోబరు నెల పూర్తి వేతనం కొత్త స్టేషన్‌లో అనుమతించాలని ట్రెజరీ అధికారులకు సూచించామని చెప్పినట్లు డైరెక్టర్ చెప్పారని రవి తెలిపారు.