హోటల్ ఫుడ్డు హోటల్ ఫుడ్డే.. ఇంటి భోజనం ఇంటి భోజనమే.. చాలామంది ప్రజలు సమయాభావం వల్ల బయటి ఫుడ్డు తినాల్సి వస్తుంది. అలా ఇంటి భోజనానికి దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటో బుధవారం జొమాటో ఎవ్రీడేని ప్రారంభించింది. ఇందులో.. సరసమైన ధరలకే ఇంట్లో వండినట్లుగా ఉండే భోజనాలను డెలివరీ చేయనుంది. జొమాటో ఎవ్రీడే ప్రస్తుతం గురుగ్రామ్‌లోని ఎంపిక చేసిన ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉందని, తాజా భోజనం రూ. 89తో ప్రారంభమవుతుందని కంపెనీ ప్రకటించింది.
“మీ ఇంటి వద్దకే, సరసమైన ధరకే ఇంటి భోజన సౌకర్యాన్ని అందిస్తున్నాం. నిజమైన హోమ్ చెఫ్‌లతో వంటలు చేయించి డెలివరీ చేయడం జరుగుతుంది. ఈ వంటలు మీ ఇంటి వంటల్లాగే ఉంటాయి. మీ ఇంటిని గుర్తుచేస్తుందని విశ్వసిస్తున్నాం.’’ అంటూ జొమాటో వ్యవస్థాపకులు, సీఈఓ దీపిందర్ గోయల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి ఫుడ్ పార్టనర్స్, హోమ్ చెఫ్‌లతో సహకరిస్తారని జొమాటో తెలిపింది.
‘‘కేవలం మెనుని బ్రౌజ్ చేయండి, మీ భోజనాన్ని ఎంచుకోండి. నిమిషాల్లో మీ ఇంటి వద్దకే వేడి వేడి, రుచికరమైన ఆహారం వచ్చేస్తుంది.’’ అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, ఈ ఇన్‌స్టంట్ సేవలను త్వరలోనే దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్లాన్స్ వేస్తోంది జొమాటో. వినియోగదారులకు సరసమైన ధరకే, హోమ్లీ ఫుడ్ అందించడం ద్వారా ఇండియాలో తమ మార్కెట్‌ను పెంచుకోవాలని భావిస్తోంది కంపెనీ.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..