Personal Loan: పర్సనల్ లోన్ కోసం అప్లై చేయాలనుకుంటున్నారా? ముందుగా ఈ 5 కీలక విషయాలు తెలుసుకోండి

|

Jul 11, 2022 | 6:59 PM

Personal Loans: హోం లోన్, కార్ లోన్ వంటి సెక్యూర్డ్ రుణాలతో పోలిస్తే వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. వడ్డీ ఎక్కువగా వస్తుందన్న కారణంగానే బ్యాంకులు కూడా మిగిలిన రుణాల కంటే పర్సనల్ లోన్స్ ఇచ్చేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతాయి.

Personal Loan: పర్సనల్ లోన్ కోసం అప్లై చేయాలనుకుంటున్నారా? ముందుగా ఈ 5 కీలక విషయాలు తెలుసుకోండి
Personal Loan
Follow us on

Personal Loans: వివిధ అత్యవసర ఆర్థిక అవసరాల కోసం చాలా మంది బ్యాంకులిచ్చే వ్యక్తిగత రుణాలను తీసుకుంటారు. ఉదాహరణకు, వైద్య అత్యవసర పరిస్థితులు, ఉన్నత విద్య, వివాహ ఖర్చులు వంటి అవసరాలకు బ్యాంకులు వ్యక్తిగత రుణాలు ఇస్తాయి. బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణాలు పొందడం సులభం. వ్యక్తిగత రుణాలు తీసుకునేందుకు రుణగ్రహీతలు బ్యాంకులకు ఎలాంటి పూచీకత్తును అందించాల్సిన అవసరం లేదు. అయితే హోం లోన్, కార్ లోన్ వంటి సెక్యూర్డ్ రుణాలతో పోలిస్తే వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. వడ్డీ ఎక్కువగా వస్తుందన్న కారణంగానే బ్యాంకులు కూడా మిగిలిన రుణాల కంటే పర్సనల్ లోన్స్ ఇచ్చేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతాయి.

అత్యవసర అవసరాల కోసం మాత్రమే పర్సనల్ లోన్స్ తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. విలాస వస్తువుల కొనుగోలు వంటి అవసరాల కోసం పర్సనల్ లోన్స్ తీసుకోకపోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఆర్బీఐ ఇటీవల రెపో రేటును పెంచడంతో దాదాపు అన్ని బ్యాంకులు పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేట్లను పెంచాయి. పర్సనల్ లోన్స్ కోసం మీరు దరఖాస్తు చేసుకునే ముందు ఈ ఐదు కీలక అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.

  1. అర్హత: అర్హత ప్రమాణాలు ఒక్కో బ్యాంకులో ఒక్కో రకంగా ఉండొచ్చు. ఇది ఆదాయ స్థిరత్వం (కనీసం ఒక సంవత్సరం పని అనుభవం), దరఖాస్తుదారు వయస్సు, CIBIL (క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్) స్కోర్ వంటి కొన్ని ప్రాథమిక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
  2. CIBIL స్కోర్: దరఖాస్తుదారుని క్రెడిట్ హిస్ట్రీ ఆదారంగా ఇచ్చే మూడు అంకెల సంఖ్య ఇది. సిబిల్ స్కోరు 300 -900 మధ్య ఉంటుంది. సూటిగా చెప్పాలంటే.. క్రెడిట్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే బ్యాంకుల్లో రుణ దరఖాస్తు ఆమోదం పొందే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. సరైన సిబిల్ స్కోరు లేదని భావిస్తే పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోకపోవడమే మంచిది.
  3. వడ్డీ రేట్లు: వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేయడానికి ముందు వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లను చెక్ చేసుకోవడం మంచిది. వడ్డీ రేటు (RoI) ఒక్కో బ్యాంకుకు ఒక్కో రకంగా ఉంటుంది. వ్యక్తిగత రుణాలను అందించే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు) కూడా ఉన్నాయి. బ్యాంకులు, NBFCలు అందించే వడ్డీ రేటును పోల్చుకుని ఏది తక్కువైతే ఆ వడ్డీకి రుణం తీసుకునే వెసులుబాటు రుణగ్రహీతలకు లభిస్తుంది. ఓ రకంగా వడ్డీ రేటు విషయంలో బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీల మధ్య పోటీ రుణగ్రహీతకు లబ్ధి చేకూరుస్తుంది. ప్రస్తుతం బ్యాంకులు సాధారణంగా సంవత్సరానికి 10.50 శాతం నుంచి 24 శాతం మధ్య వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి.
  4. సులభతర దరఖాస్తు: వ్యక్తిగత రుణాన్ని ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, పర్సనల్ లోన్ రుణగ్రహీత బ్యాంకు లేదా NBFCలో ఇప్పటికే ఉన్న కస్టమర్ అయితే రుణం కోసం దరఖాస్తు చేసుకుని తక్కువ వడ్డీ రేటు కోసం అభ్యర్థించవచ్చు. క్రెడిట్ కార్డ్ హోల్డర్లు వారి కార్డ్ వినియోగం, రీపేమెంట్ హిస్ట్రీ వంటి అంశాలతో సులభంగా వ్యక్తిగత రుణాలను పొందవచ్చు. అయితే మిగిలిన లోన్స్‌తో పోల్చితే ఈ రుణాలపై వడ్డీ రేట్లు కాస్త ఎక్కువగా ఉంటాయి.
  5. ప్రీపేమెంట్ ఛార్జీలు: రుణగ్రహీతలు ముందుగా అంగీకరించిన టెన్యూర్ పూర్తికాక ముందే వ్యక్తిగత రుణాన్ని మూసివేయాలనుకున్నప్పుడు బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు ఫోర్‌క్లోజర్ వసూలు చేస్తాయి. మీరు లోన్ కోసం ఏదైనా బ్యాంకులో దరఖాస్తు చేసే ముందు ప్రీపేమెంట్ ఛార్జీల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తలు చదవండి