
ఇటీవల విడుదలైన ఓ నివేదిక ప్రకారం.. కార్లను కొనుగోలు చేస్తున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. దీనిలో ప్రతి ఏటా గణనీయమైన ప్రగతి నమోదవుతుంది. మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలుస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ వివరాలు తెలుసుకుందాం. ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న మహిళలందరూ తమ అవసరాలకు అనుగుణంగా కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఆటోమోటివ్ రంగం ఇటీవల వెల్లడించిన ఈ లెక్కలు వారి పురోగతికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆ ప్రకారం.. 2013లో మొత్తం కస్టమర్ డేటా బేస్ లో మహిళలు 16 శాతంగా ఉన్నారు. 2024లో వారి సంఖ్య 26 శాతానికి పెరిగింది. అలాగే 2025లో 46 శాతానికి చేరుకోవడం గమనార్హం.
నివేదికలో వెల్లడించిన లెక్కలు మహిళల విజయాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపార రంగాల్లో వారి ఉన్నతిని సూచిస్తున్నాయి. సాధారణంగా వేగంగా పనులు చేసుకోవడం, సమయానికి కార్యాలయానికి వెళ్లడం, వివిధ ప్రాంతాలకు ప్రయాణించడానికి కార్లను కొనుగోలు చేస్తారు. నేడు ఆధునిక మహిళలు కూడా ఈ అవసరాలకే కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఆయా రంగాల్లో వారికి పెరిగిన ప్రాధాన్యతను ఇది తెలియజేస్తోంది. అలాగే కార్ల పరిశ్రమకు కొత్త విశ్వాసాన్ని తీసుకువస్తోంది. మహిళలు ఏ కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారనే విషయాన్ని కూడా నివేదిక వెల్లడించింది. దాని ప్రకారం సుమారు 60 శాతం మంది ఆటోమేటిక్ హ్యాచ్ బ్యాక్ లపై ఆసక్తి చూపుతున్నారు. వీటిని వినియోగించడం చాలా సులభంగా ఉండడంతో వాటిపైకి మొగ్గు చూపుతున్నారు. అలాగే కాంపాక్ట్ ఎస్ యూవీలను 18 శాతం మహిళలు ఎంపిక చేసుకుంటున్నారు. వీరు ఎక్కువగా ఇష్టపడుతున్న మోడళ్లలో రెనాల్డ్ క్విడ్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, మారుతీ సుజుకీ స్విఫ్ట్ ప్రముఖంగా ఉంటున్నాయి.
ఢిల్లీ–ఎన్సీఆర్ లో అత్యధికంగా మహిళలు కార్లను కొనుగోలు చేస్తున్నారు. అక్కడ దాదాపు 48 శాతం వీరే ఉన్నారు. ఆ తర్వాత ముంబై 46 శాతం, బెంగళూరు 41 శాతం, పూణేలో 39 శాతం మంది ఉన్నారు. అలాగే లక్నో, జైపూర్ వంటి నాన్ మెట్రో నగరాల్లో కూడా మహిళా కొనుగోలు దారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అక్కడ దాదాపు 20 శాతం వరకూ ఉంటున్నారు. కార్ల కొనుగోలు చేసే వారిలే 30 నుంచి 40 ఏళ్ల వయసున్న వారే ఎక్కువగా ఉంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి