Telugu News Business With these plans, pension in hand every month, Retirement life is now a joy, Best pension plans details in telugu
Best pension plans: ఈ పథకాలతో ప్రతి నెలా చేతికి పెన్షన్.. విశ్రాంత జీవితం ఇక సంతోషమే..!
ఉద్యోగ విరమణ తర్వాత విశ్రాంత జీవితాన్ని సంతోషంగా గడపడానికి ప్రతి ఒక్కరూ ప్రణాళికలు వేసుకుంటారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకుంటారు. దీని కోసం ఉద్యోగంలో కొనసాగుతుండగానే వివిధ మార్గాల్లో డబ్బులను పెట్టుబడి పెడతారు. వీటిలో పెన్షన్ ప్లాన్లు ప్రముఖంగా ఉంటాయి. విశ్రాంత జీవితానికి భద్రత కల్పించడానికి, క్రమం తప్పకుండా ఆదాయం ఇవ్వడానికి తోడ్పడతాయి.
ప్రస్తుతం మార్కెట్ లో అనేక రకాల పెన్షన్ల ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో తమ అవసరాలకు అనుగుణంగా ఉండే దాన్ని ఎంపిక చేసుకోవడం చాలా కీలకం. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ ప్లాన్, టాటా ఏఐఏ స్మార్ట్ పెన్షన్ ప్లాన్ మధ్య ఉన్న తేడాలు, ఉపయోగాలు తెలుసుకుందాం.
ఎల్ఐసీ స్మార్ట్ ఫెన్షన్ ప్లాన్
దేశంలోనే అతి పెద్ద బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) కొత్తగా ఈ పెన్షన్ ప్లాన్ ను తీసుకువచ్చింది. ఉద్యోగ విరమణ చేసిన వారి అవసరాలను తీర్చేందుకు దీన్ని రూపొందించారు. ఇది ఒక నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్, ఇండివిడ్యువల్ \ గ్రూప్, సేవింగ్స్, తక్షణ యాన్యుటీ ప్లాన్. విశ్రాంత జీవితాన్ని ఆనందంగా గడపాలనుకునే వారికి సురక్షితమైన పథకం అని చెప్పవచ్చు.
ఫైనాన్సియల్ సెక్యూరిటీ, మార్కెట్ కాన్ఫిడెన్స్, ఆదాయం, తక్షణ యాన్యుటీ వంటి ఎన్నో ప్రయోజనాలు ఈ పథకంలో లభిస్తాయి. ఈ పాలసీ తీసుకున్న తర్వాత నెల నుంచే పెన్షన్ వచ్చేలా ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంది.
దీనిలో ఒకసారి పెట్టుబడి పెడితే సరిపోతుంది. ప్రతినెలా చేతికి పెన్షన్ వస్తూనే ఉంటుంది. ఉద్యోగ విరమణ అనంతరం ప్రతి నెలా ఆదాయం రావడం వల్ల ఒత్తిడి ఉండదు.
18 ఏళ్ల నుంచి 100 ఏళ్ల వయసు వరకూ ఈ పెన్షన్ల ప్లాన్ ను కొనుగోలు చేయవచ్చు. నాన్ లింక్డ్ ప్రోడక్టు అవ్వడంతో మార్కెట్ తో సంబంధం లేకుండా గ్యారెంటీగా రిటర్న్స్ పొందవచ్చు. దీనిలో రెండు రకాల యాన్యుటీ ఆప్షన్లు ఉన్నాయి. సింగిల్ లైఫ్ ప్లాన్ లో ఆ వ్యక్తి జీవించి ఉన్నంత కాలం పెన్షన్ లభిస్తుంది. ఒక జాయింట్ యాన్యుటీ ప్లాన్ తీసుకుంటే ఇద్దరు ప్రైమరీ, సెకండరీ సభ్యులు జీవించి ఉన్నంత కాలం పెన్షన్ అందుతుంది.
టాటా ఏఐఏ స్మార్ట్ పెన్షన్ సెక్యూర్ ప్లాన్
ఉద్యోగ విరమణ అనంతరం ఆర్థిక భద్రత కోరుకునేవారి కోసం టాటా ఏఐఏ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ స్మార్ట్ పెన్షన్ సెక్యూర్ ప్లాన్ ను ప్రారంభించింది. కొత్త తరం పదవీ విరమణ అవసరాలను అనుగుణంగా దీన్ని రూపొందించారు. ఇది ఒక వినూత్న యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్ (యూఎల్ఐపీ). ద్వితీయ ఆదాయ మార్గాలను రూపొందించడం నుంచి పదవీ విరమణ పొదుపులు పొందాలనుకునే వారి ఆలోచనలకు వీలుగా ఉంటుంది.
ఈక్విటీలో వంద శాతం నిధులను కేటాయించే ఎంపికతో వివిధ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టుకునే అవకాశం ఉంది. అవసరమైతే ఒక ఫండ్ నుంచి మరో ఫండ్ కు మారిపోవచ్చు. దానికి ఎలాంటి అదనపు ఖర్చు ఉండదు.
మీ డబ్బును మీకు నచ్చిన ఫండ్స్ లో పెట్టుబడి పెడతారు. ఆన్ లైన్ కొనుగోలు తో ఫండ్ బూస్టర్లు, లాయల్టీ జోడింపులు ఉంటాయి.
ఫార్మసీ కొనుగోళ్లు, రోగ నిర్ధారణ పరీక్షలపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందించే హెల్త్ బడ్డీ సర్వీస్, కస్టమర్ హెల్త్ సెక్యూర్ రైడర్ ను ఎంచుకోవడం ద్వారా ఓపీడీ సేవలు పొందవచ్చు.
80 సీసీసీ కింద పన్ను ఆదా, మెచ్యూరిటీ సమయంలో లంప్సమ్ పై 60 శాతం పన్ను రహితం. ఆపద సమయంలో కుటుంబ అవసరాలను తీర్చడానికి అంతర్నిర్మిత ప్రీమియం మినహాయింపు ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.
ఈ ప్లాన్ లో స్మార్ట్ పెన్షన్ సెక్యూర్, స్టార్ట్ పెన్షన్ సెక్యూర్ ప్లస్ అనే రెండు ఎంపికలు ఉన్నాయి. 35 ఏళ్ల నుంచి 75 ఏళ్ల వారు చేరవచ్చు.