
బంగారం అంటే ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరు. అయితే బంగారం గురించి మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. గోల్డ్ పసుపు రంగులో ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. భూమిపై వెండి, రాగి లాంటి చాలా లోహాలు ఉండగా.. వాటి కంటే బంగారం తన రంగుతో ప్రత్యేకతను చాటుకుంది. చాలా లోహాలు వెండి లేదా బూడిద రంగులో కనిపిస్తాయి. కానీ బంగారం సహజంగా ముదురు బంగారు పసుపు రంగును కలిగి ఉంటుంది. ఈ ప్రత్యేక లక్షణం కారణంగానే బంగారం ప్రపంచంలోని అత్యంత విలువైన లోహాలలో ఒకటిగా ఉంది. అసలు బంగారం ఎందుకు పసుపు రంగులో ఎందుకు ఉంటుందో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనుక ఉన్న రహస్య మేంటో ఇప్పుడు చూద్దాం.
ఏదైనా వస్తువుకు సంబంధించి రంగు అది పరావర్తనం చెందించే కాంతి తరంగదైర్ఘ్యాలపై ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువుపై తెల్లని సూర్యకాంతి పడినప్పుడు కొన్ని రంగులు శోషించబడితే.. మరికొన్ని పరావర్తనం చెందుతాయి. పరావర్తనం చెందిన కాంతి మన కళ్ళకు చేరుతుంది. మన మెదడు దానిని ఆ వస్తువు రంగుగా అర్థం చేసుకుంటుంది. వెండి, అల్యూమినియంతో పాటు చాలా లోహాలు దాదాపు మొత్తం దృశ్య కాంతి వర్ణపటాన్ని పరావర్తనం చెందిస్తాయి. దీంతో తెలుపు లేదా వెండి రంగులో కనిపిస్తాయి. కానీ బంగారం ఇతర లోహాల కంటే భిన్నంగా ఉంటుంది. బంగారం నీలం, ఊదా తరంగదైర్ఘ్యాలలో అధిక భాగాన్ని శోషించుకుంటుంది. ఎరుపు, నారింజ, పసుపు తరంగదైర్ఘ్యాలను మన కళ్ళకు తిరిగి ప్రతిబింబిస్తుంది. దీని వల్ల బంగారం పసుపు రంగులో కనిపిస్తుంది.
బంగారు అణువులలోని ఎలక్ట్రాన్లు అత్యంత వేగంగా కదులుతాయి. దీంతో బంగారు అణువులు కాంతితో సంకర్షణ చెందే విధానాన్ని మారుస్తాయి. ఈ ప్రభావంతో బంగారం నీలి కాంతిని శోషించుకుంటూ పసుపు, నారింజ, ఎరుపు రంగులను ప్రతిబింబిస్తుంది. అందుకే బంగారానికి బంగారు-పసుపు మెరుపు ఉంటుంది. ఈ విషయం దాదాపు చాలామందికి తెలియదు. బంగారం పసుపు రంగులోనే ఎందుకు ఉంటుదా అని ఆలోచించేవారికి ఇదే సమాధానం. ప్రపంచంలోనే అత్యంత విలువైన లోహంగా బంగారం ప్రసిద్ది పొందింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో బంగారానికి ఫుల్ క్రేజ్ ఉంది. పెళ్లి, పంక్షన్ ఏదైనా సరే ముందుగా బంగారం గురించే చర్చ మొదలవుతోంది. కేవలం ఆభరణంగానే కాకుండా ఒక సెంటిమెంట్‌గా గోల్డ్‌ను భారతీయులు భావిస్తారు.