చక్కెరను ఫస్ట్ కనిపెట్టిన దేశం ఏదో తెలుసా..? 99 శాతం మందికి తెలియని చెరకు కథ..
ఇంగ్లీషులో షుగర్.. హిందీలో చీనీ.. తెలుగులో చక్కెర.. పేరేదైనా ఈ తీపి పదార్థం వెనుక వేల ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం దాగి ఉంది. పూర్వకాలం నుంచే భారతీయులు చక్కెరను తయారు చేస్తున్నారని మనమంతా భావిస్తాం. కానీ అసలు చెరకు మొక్క పుట్టుక భారతదేశంలో జరగలేదన్న చేదు నిజాన్ని ఎప్పుడైనా గమనించారా? వేల మైళ్ల దూరంలోని ఒక సుదూర ద్వీపంలో పుట్టిన అడవి మొక్క.. భారతదేశానికి చేరి ప్రపంచాన్ని శాసించే తీపి చక్కెరగా ఎలా మారిందో తెలుసుకుందాం..

ఉదయం లేవగానే తాగే వేడివేడి టీ నుంచి పండుగ వేళ నోరూరించే స్వీట్ల వరకు ప్రతి ఇంట్లోనూ చక్కెర పాత్ర ఎంతో కీలకం. పండుగల సీజన్ మొదలవగానే పిండివంటలు, మిఠాయిల సందడి పెరుగుతుంది. అయితే చక్కెరను పురాతన కాలం నుంచే భారతీయులు పండిస్తూ వస్తున్నారని చాలామంది భావిస్తుంటారు. చరిత్ర పుటలను నిశితంగా పరిశీలిస్తే మాత్రం అసలు చెరకు మొక్క పుట్టుక, చక్కెర తయారీ వెనుక ఎన్నో ఆశ్చర్యకరమైన చారిత్రక వాస్తవాలు వెలుగుచూస్తాయి. వాస్తవానికి మనం రోజూ వాడే చక్కెరను ఉత్పత్తి చేసే చెరకు మొక్క మూలాలు భారతదేశంలో మొదలుకాలేదు. సుమారు 10 వేల ఏళ్ల క్రితం నైరుతి పసిఫిక్ మహాసముద్రంలోని న్యూ గినియా ద్వీపంలో చెరకు మొక్క పుట్టిందని చరిత్రకారులు చెబుతున్నారు. అక్కడి స్థానిక ప్రజలు చెరకును సాగుచేస్తూ, తీపి కోసం దాని కాండాలను పచ్చిగా నమిలేవారు. ఆ తర్వాత ప్రాచీన సముద్ర వాణిజ్య మార్గాల ద్వారా ఈ తీపి మొక్క నెమ్మదిగా ఆగ్నేయాసియాకు, అక్కడి నుంచి దక్షిణ చైనా ప్రాంతాలకు విస్తరించింది.
చెరకు మొక్క విదేశీ గడ్డపై పుట్టినప్పటికీ, దాని రసాన్ని మరిగించి చక్కెరను తయారుచేసే అద్భుత కళ మాత్రం భారతదేశంలోనే ప్రాణం పోసుకుంది. దాదాపు 3వేల ఏళ్ల క్రితం ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తలు, రైతులు చెరకు రసాన్ని మరిగించి స్ఫటికాలుగా మార్చే వినూత్న సాంకేతికతను కనిపెట్టారు. ఈ తీపి ఆవిష్కరణకు పెట్టిన సంస్కృత పదం శర్కర నుంచే ప్రపంచంలోని వివిధ భాషల్లో చక్కెర పేర్లు రూపాంతరం చెందాయి. ఇంగ్లీషులో ప్రాచుర్యం పొందిన షుగర్ అనే పదం కూడా సంస్కృతంలోని శర్కర నుంచే పుట్టింది. భారతదేశంలో అభివృద్ధి చెందిన ఈ చక్కెర తయారీ విధానం వాణిజ్య బృందాల ద్వారా పర్షియాకు చేరి, అక్కడి నుంచి అరబ్ దేశాలకు, తదనంతరం ఐరోపా ఖండానికి విస్తరించింది.
కాలక్రమంలో చైనాలో శుద్ధి చేసిన తెల్ల చక్కెర తయారీ పద్ధతులు అభివృద్ధి చెందగా, అవి తిరిగి భారతదేశానికి వచ్చాయి. అందుకే ఉత్తర భారతదేశంలో చక్కెరను చీనీ అని పిలిచే వాడుక మొదలైంది. పునరుజ్జీవన కాలంలో యూరోపియన్ దేశాలు చక్కెరను ఒక ప్రధాన వ్యాపార సరుకుగా మార్చి ప్రపంచ వాణిజ్యాన్ని భారీగా విస్తరించాయి. 17వ, 19వ శతాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ చెరకు తోటల విస్తరణ జరగడం ప్రపంచ జనాభా మార్పులకు కూడా దారితీసింది. చెరకు మొక్క మూలాలు వేరే ద్వీపానికి చెందినవైనా, ప్రపంచానికి అసలైన తీపి చక్కెరను అందించిన ఘనత మాత్రం భారతదేశానికే దక్కుతుంది.
