తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపై వారి పిల్లలకు హక్కు ఉంటుంది. కుటుంబానికి అధిపతిగా ఉన్నవారు రాసిన వీలునామ ప్రకారం వారి వారసులకు ఆస్తిని పంచే వీలుంటుంది. ఈ వీలునామ సక్రమంగా ఉంటే కుటుంబ అధిపతి చనిపోయినా కుటుంబంలో ఆస్తి వివాదం ఉండదు. అయితే కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులకు ఆస్తులేమి లేకుండా వారి తర్వాత తరం అంటే వారి కొడుకు కొంత ఆస్తి సంపాదించారనుకోండి? ఆ ఆస్తిపై తల్లిదండ్రులకు హక్కు ఉంటుందా? లేక ఆ కొడుకు భార్యకు పూర్తి ఆస్తి దక్కుతుందా? ఏదైనా ప్రమాదమో లేక జబ్బు చేసో కొడుకు మరణిస్తే.. చట్ట ప్రకారం అతని ఆస్తి ఎవరికి చెందుతుంది? వంటి సందేహాలు సహజంగానే వస్తుంటాయి. ఈ సందేహాలను నివృత్తి చేసేందుకే ఈ కథనం ఇస్తున్నాం. మిస్ అవ్వకండి.
హిందూ వారసత్వ చట్టం ప్రకారం, ఒక వ్యక్తి ఆస్తిలో భార్య, పిల్లలు, తల్లి క్లాస్ 1 వారసులు. ఒక వ్యక్తి మరణిస్తే, అతని ఆస్తిని క్లాస్ 1 వారసుల మధ్య సమానంగా విభజిస్తారు. ఒకవేళ చెల్లుబాటు అయ్యే వీలునామా లేకపోతే మరణించిన పురుషుని ఆస్తిని వారసత్వంగా పొందేందుకు అర్హులైన వారిని రెండు తరగతులుగా విభజిస్తారు. అవి క్లాస్ I వారసులు, క్లాస్ II వారసులు. మొదటిగా ఆస్తి క్లాస్ I వారసులకు విభజిస్తారు. క్లాస్ I వారసులు లేకపోతే.. అప్పుడు క్లాస్ II వారసులకు పంచుతారు. క్లాస్ II లో మరణించిన వ్యక్తి తమ్ముడు, చెల్లెలు, తండ్రి యొక్క తల్లి, తమ్ముడు లేదా చెల్లెల యొక్క కొడుకు లేదా కూతురు, తల్లి యొక్క తల్లి, తల్లియొక్క తండ్రి వంటి వారు ఉంటారు.
మరణించిన వ్యక్తికి అతని తల్లి, భార్య, పిల్లలు ఉంటే.. అతని ఆస్తిని తల్లి, భార్య, కొడుకుల మధ్య సమానంగా విభజిస్తారు. వాస్తవానికి తల్లిదండ్రులకు వారి పిల్లల ఆస్తిపై పూర్తి హక్కులు ఉండవు. అయినప్పటికీ, పిల్లలు అకాల మరణం చెంది.. సరైన వీలునామా లేనట్లయితే, తల్లిదండ్రులు తమ పిల్లల ఆస్తిపై హక్కులను పొందవచ్చు.
హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 8 పిల్లల ఆస్తిపై తల్లిదండ్రుల హక్కులను నిర్వచిస్తుంది. దీని ప్రకారం, పిల్లల ఆస్తికి తల్లి మొదటి వారసురాలు కాగా, పిల్లల ఆస్తికి తండ్రి రెండో వారసుడు. ఈ విషయంలో చట్టం తల్లులకు ప్రాధాన్యం ఇచ్చింది . అయితే మొదటి వారసుడి జాబితాలో ఎవరూ లేకుంటే రెండో వారసుడి తండ్రి ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..