
మన భవిష్యత్తును ఆర్థికంగా భద్రపరచుకోవాలనుకుంటే దానికి అవసరమైన నిధులు మన వద్ద సిద్ధంగా ఉండాలి. మీరు పని చేస్తూ ఎక్కువ రిస్క్ తీసుకోకూడదనుకుంటే పీఎఫ్ కాకుండా మీ పదవీ విరమణ కోసం సిద్ధం కావడానికి రెండు మంచి ఎంపికలు ఉన్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ ద్వారా మంచి లాభాలను పొందవచ్చు. అయితే చాలా ఈ రెండు ఎంపికల్లో దేనిని ఎంచుకోవాలో? తెలియక గందరగోళానికి గురవుతారు. మీరు కూడా ఈ రెండు ఆప్షన్‌లలో దేనినైనా ఎంచుకోవడంలో గందరగోళంగా ఉంటే పీపీఎఫ్‌తో పాటు ఎన్‌పీఎస్ లాభాలు, నష్టాలను తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు పథకాలను మధ్య ప్రధాన తేడాలపై ఓ లుక్కేద్దాం.
పీపీఎఫ్ అనేది ప్రభుత్వం నిర్వహించే దీర్ఘకాలిక పొదుపు పథకం. పదవీ విరమణ కోసం డబ్బు ఆదా చేయడానికి ఇది ఉత్తమ ఎంపికగా పరిగణిస్తారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం పీపీఎఫ్ సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా పరిగణిస్తారు. ఇది ప్రభుత్వం నిర్దేశించిన స్థిరమైన రాబడిని అందించే దీర్ఘకాలిక పొదుపు పథకం. పీపీఎఫ్‌లో పెట్టుబడి మొత్తానికి గరిష్ట పరిమితి లేదు. దీని కాలవ్యవధి 15 సంవత్సరాలుగా ఉంటుంది. ఇక్కడ సంవత్సరానికి 500 నుంచి 1.5 లక్షల వరకు పీపీఎఫ్ ఖాతాలో పెట్టుబడి పెట్టవచ్చు. పన్ను ఆదా దృష్ట్యా పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడం కూడా మంచిది. ఎందుకంటే పెట్టుబడి పెట్టిన మొత్తానికి వచ్చే వడ్డీకి ఎలాంటి పన్ను ఉండదు. ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ ప్రకారం, ఈ మొత్తం పన్ను రహితం. భారతీయ పౌరుడు అంటే 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా పీపీఎఫ్ ఖాతాను తెరిచి అందులో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం భారతదేశంలోని నాన్-రెసిడెంట్స్ (ఎన్ఆర్ఐ) లేదా హిందూ అవిభక్త కుటుంబాలకు (హెచ్‌యూఎఫ్) వర్తించదు. ఒక వ్యక్తి తన పేరు మీద ఒక పీపీఎఫ్ ఖాతాను మాత్రమే కలిగి ఉండవచ్చు. ఉమ్మడి ఖాతాలు అనుమతించరు. ఎవరైనా అసమర్థులు లేదా మైనర్ కోసం అదనపు పీపీఎఫ్ ఖాతాను తెరవవచ్చు.
ఎన్‌పీఎస్ అనేది స్వచ్ఛంద పదవీ విరమణ పొదుపు పథకం. ఇది పౌరులు తమ ఉద్యోగ జీవితంలో తమ భవిష్యత్‌లో పెట్టుబడి పెట్టడానికి అనుమతించే ప్రభుత్వ పథకం. పదవీ విరమణ సమయంలో ఎన్‌పిఎస్‌లో అరవై శాతం పెట్టుబడిని తీసుకోవచ్చు. మిగిలిన 40 శాతం పెన్షన్ ప్లాన్ కొనుగోలుకు వినియోగిస్తారు. ఎన్‌పీఎస్ స్థిర-రాబడి పెట్టుబడి కాదు. ఎన్‌పీఎస్‌పై రాబడి మార్కెట్ రిస్క్‌తో ముడిపడి ఉంటుంది. ఉద్యోగి జీతంలో 20 శాతం వరకు ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఎన్‌పీఎస్ 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న భారతీయ పౌరులందరికీ అందుబాటులో ఉంటుంది. పథకంలో చేరడం ద్వారా, క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. మీరు పీఓపీ/ఎస్‌పీ కోసం దరఖాస్తు చేసినప్పుడు మీ వయస్సు తప్పనిసరిగా 18 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉండాలి. ముఖ్యంగా ఖాతా తెరవడానికి ఖాతాదారు తప్పనిసరిగా సంబంధిత పత్రాలను అందించాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..