
ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రాం తరహాలో ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు ఫోన్ నెంబర్ ఆధారంగా వాట్సప్‌లో వ్యక్తులను గుర్తిస్తున్నాం. దీని స్థానంలో యూజర్ నేమ్ ద్వారా వ్యక్తులను గుర్తించేలా వాట్సప్ కొత్త ఫీచర్ తీసుకొస్తుంది. మీరు ఎవరైనా వ్యక్తిని సంప్రదించాలంటే వారి యూజర్ నేమ్ తెలుసుకోవాల్సి ఉంటుంది. తొలుత వాట్సప్‌లోకి లాగిన్ అవ్వడానికి మొబైల్ నెంబర్ అవసరం. ఆ తర్వాత యూజర్ నేమ్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే దాని ఆధారంగానే ఎదుటి వ్యక్తులు మితో కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. దీని వల్ల యూజర్ల మొబైల్ నెంబర్ తెలియకపోవడం వల్ల సైబర్ మోసాలు తగ్గుతాయని వాట్సప్ చెబుతున్నప్పుడు.. ఈ ఫీచర్ వల్ల అనేక నష్టాలు కూడా ఉన్నాయి.
ఈ ఫీచర్ వల్ల జరిగే నష్టం నకిలీ యూజర్‌నేమ్‌లు. సైబర్ నేరగాళ్లు నకిలీ యూజర్ నేమ్‌లు సృష్టించి మోసాలకు పాల్పడవచ్చు. మీ బ్యాంకు, మీ యజమాని లేదా మీ సన్నిహిత మిత్రుని యూజర్‌నేమ్‌ను పోలిన యూజర్‌నేమ్ క్రియేట్ చేసి మీకు మెస్సేజ్ పంపవచ్చు. ఒక్క అక్షరం లోపించినా, అదనపు అండర్‌స్కోర్ ఉన్నా, స్పెల్లింగ్‌లో మార్పులు ఉన్నా గమనించకపోవచ్చు. దీని వల్ల నమ్మకమైన వ్యక్తి అనుకుని మీరు డబ్బులు పంపడం, ఇతర వ్యక్తిగత సమాచారం షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ వల్ల జరిగే అతిపెద్ద నష్టాల్లో ఇది ఒకటిగా చెప్పవచ్చు. ఇక మోసగాళ్లు నిజమైన పరిచయస్తులుగా నటిస్తూ, హానికరమైన లింక్‌లను క్లిక్ చేయమని, OTPలను వెల్లడించమని లేదా బ్యాంకింగ్ వివరాలను పంచుకోమని కోరుతూ ఫిషింగ్ మెస్సేజ్‌లు పంపవచ్చు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు వినియోగదారులను మోసం చేయవచ్చు. మోసగాళ్లు నిమిషాల వ్యవధిలోనే వాస్తవిక సంభాషణలు, క్లోన్ చేసిన వాయిస్, నమ్మశక్యమైన చిత్రాలను సృష్టించవచ్చు. నకిలీ యూజర్‌నేమ్‌లను ఏఐ సృష్టించిన కంటెంట్‌తో కలపడం వల్ల సోషల్ ఇంజనీరింగ్ దాడులకు పాల్పడవచ్చు. ఫోన్ నంబర్లను రివీల్ చేయకపోవడం వల్ల వినియోగదారులకు ప్రయోజనం ఉంటుంది. కానీ ఇది ఆకతాయిలు, మోసగాళ్లు, దురుద్దేశపూర్వక వ్యక్తులను గుర్తించేందుకు కూడా కష్టతరమవుతుంది. యూజర్‌నేమ్‌ల వల్ల సైబర్ నేరగాళ్లు వివిధ ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో మోసపూరిత ఖాతాలను సృష్టించి నిర్వహించడం సులభతరం అవుతుంది. అయితే యుజర్ నేమ్ అనేది మొబైల్ నెంబర్‌కు లింక్ అయి ఉంటుది. దీని వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని వాట్సప్ చెబుతోంది. కానీ భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.