
గతంలో ఎప్పుడూ కనీవిని ఎరుగని విధంగా ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.1.5 లక్షలు దాటి, కిలో వెండి ధర రూ.3.5 లక్షలు దాటిపోయింది. ఒక ఏడాది క్రితం వీటిపై పెట్టుబడి పెట్టిన వారు నేడు ధనవంతులు అయ్యారు. భవిష్యత్తులో ధరలు మరింత పెరుగుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా రెగ్యులర్ పెట్టుబడిదారులతో పాటు సామాన్యులు కూడా ఇప్పుడు బంగారం, వెండిలో వివిధ మార్గాల్లో పెట్టుబడి పెడుతున్నారు.
అయితే బంగారాన్ని మించి అధిక లాభాలు ఇస్తోందంటూ సిల్వర్ ఈటీఎఫ్ పేరు ప్రస్తుతం మార్కెట్‌లో మారుమోగిపోతుంది. సిల్వర్ ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెడితే మంచి రాబడిని పొందవచ్చని ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో సామాన్యులు కూడా ఈ సిల్వర్ ఈటీఎఫ్‌లపై ఆసక్తి చూపిస్తున్నారు. అసలింతకీ ఈ సిల్వర్ ఈటీఎఫ్ అంటే ఏమిటి? మీరు సిల్వర్ ఈటీఎఫ్‌లో ఎలా పెట్టుబడి పెట్టవచ్చు? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
సిల్వర్ ETF అనేది ఒక రకమైన మ్యూచువల్ ఫండ్. సిల్వర్ ETFలో ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. సిల్వర్ ETFలో పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు ఒక రకమైన స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టినట్లు అవుతుంది. మీరు వెండి బిస్కెట్లు, నాణేలు లేదా వెండి ఆభరణాలను కొనకుండా సిల్వర్ ETF ద్వారా వెండిలో పెట్టుబడి పెట్టవచ్చు. సిల్వర్ ETF స్టాక్ మార్కెట్‌తో ముడిపడి ఉంటుంది. వెండి ధర పెరిగినప్పుడు, సిల్వర్ ETF విలువ కూడా పెరుగుతుంది. అదేవిధంగా వెండి ధర తగ్గినప్పుడు సిల్వర్ ETF విలువ తగ్గుతుంది.
సిల్వర్ ETF ద్వారా మీరు నేరుగా వెండిలో పెట్టుబడి పెడతారు. మీరు సిల్వర్ ETF ద్వారా డబ్బు పెట్టుబడి పెట్టినప్పుడు, వెండి ధర ప్రకారం మీకు కొన్ని యూనిట్లు కేటాయిస్తారు. వెండి ధర పెరిగినప్పుడు ఈ యూనిట్ల విలువ పెరుగుతుంది. వెండి ధర తగ్గినప్పుడు, మీ ఖాతాలోని యూనిట్ల విలువ తగ్గుతుంది. దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి సిల్వర్ ETF మంచి ఎంపిక. ప్రస్తుత పరిస్థితిని బట్టి, భవిష్యత్తులో వెండి ధర పెరగవచ్చు. అందువల్ల సిల్వర్ ETF ద్వారా పెట్టుబడి పెట్టిన మీ డబ్బు విలువ పెరగవచ్చని ఆర్థిక నిపుణుల అంచనా.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి