బ్యాంకింగేతర సంస్థలు నిర్వహించే ఏటీఎంలను వైట్ లేబుల్ ఏటీఎంలు(White Label ATM) అంటారు. బ్యాంకు ఖాతాదారులు ఈ యంత్రాలను సాధారణ ఏటీఎంల మాదిరిగానే ఉపయోగించుకోవచ్చు. నగదు ఉపసంహరణ, విచారణ వంటి డెబిట్ కార్డు సేవలను వీటి వద్ద పొందొచ్చు. వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో బ్యాంకింగ్(Banking) సేవలు అందించాలనే లక్ష్యంతో బ్యాంకింగేతర సంస్థలు కూడా ఏటీఎంలను నిర్వహించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం – 2007 కింద అనుమతించింది. టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్స్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఇండియా పేమెంట్స్ లిమిటెడ్, హిటాచి పేమెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి కొన్ని సంస్థలు ఈ విధంగా దేశంలో వైట్ లేబుల్ ఏటీఎం సేవలను ప్రజలకు అందిస్తున్నాయి.
సాధారణంగా బ్యాంకులు ఏటీఎంలను ఏర్పాటు చేస్తాయి. బ్యాంకు బ్రాంచ్‌లు అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో కూడా కొన్ని రకాల బ్యాంకింగ్ సేవలను అందించేందుకు గానూ ఏటీఎంలను ఏర్పాటు చేస్తుంటాయి. అయితే వీటి ఏర్పాటు ఖర్చుతో కూడుకున్న పని. ఏటీఎం యంత్రాలు, భద్రత, నగదు నిర్వహణ వంటి ఖర్చుల కారణంగా బ్యాంకులు అన్ని చోట్లా ఏటీఎంలను ఏర్పాటు చేయడం సాధ్యం కాకపోవచ్చు. అందువల్ల వైట్ లేబుల్ ఏటీఎంల ఏర్పాటుకు ఆర్‌బీఐ అనుమతించింది.
ఈ ఏటీఎంల్లో నగదు విత్‌డ్రాతో పాటు ఖాతా సమాచారం, నగదు డిపాజిట్, బిల్లు చెల్లింపు, మినీ స్టేట్‌మెంట్, పిన్ మార్పు, చెక్ బుక్ కోసం అభ్యర్థనలు వంటి ఇతర సేవలు అందుబాటులో ఉంటాయి. సాధారణ బ్యాంకు ఏటీఎంను ఏవిధంగా ఉపయోగిస్తామో.. అదేవిధంగా వైట్ లేబుల్ ఏటీఎంలను ఉపయోగించుకోవచ్చు. బ్యాంకు ఏటీఎంల వద్ద పరిమితి మేరకు ఉచిత లావాదేవీలను నిర్వహించేందుకు ఆర్‌బీఐ అనుమతించింది. ఆ పరిమితికి లోబడి వైట్ లేబుల్ ఏటీఎంల వద్ద చేసే లావాదేవీలకు కూడా ఎటువంటి ఛార్జీలూ వర్తించవు. బ్యాంకు ఒక నెలలో ఐదు ఉచిత లావాదేవీలను అందిస్తే.. బ్యాంక్ సొంత ఏటీఎంతో పాటు ఇతర బ్యాంకుల ఏటీఎంల వద్ద వైట్ లేబుల్ ఏటీఎంల వద్ద పరిమితులకు లోబడి ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు.
కొన్ని సంస్థలు వైట్ లేబుల్ ఏటీఎంలను ఏర్పాటు చేసి వాటిని బ్యాంకులకు అద్దెకు ఇస్తుంటాయి. అటువంటి ఏటీఎంలను బ్యాంకు సొంత ఏటీఎంలు పరిధిలోకి వస్తాయి. బ్యాంకు అనుమతించిన మేరకు ఉచిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఏటీఎంల వద్ద పరిమితికి మించిన లావాదేవీలపై ఛార్జీలు వర్తిస్తాయి.
Read Also..Post Office Scheme: నెలనెలా ఆదాయం వచ్చే పోస్టాఫీస్ పథకం.. ఖాతా ఎలా తెరవాలంటే..