Gold: 24 క్యారెట్ల బంగారం అంటే ఏంటి..? ఆ పేరుతో ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా..?

బంగారం కొనుగోలు చేసేటప్పుడు 24 క్యారెట్లు, 22 క్యారెట్లు అని మీరు వినే ఉంటారు. ఇక 24 క్యారెట్ల గోల్డ్‌లో కూడా 999, 995 క్వాలిటీ కలిగిన బంగారం కూడా ఉంటుంది. అసలు వీటి మధ్య తేడాలేంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

Gold: 24 క్యారెట్ల బంగారం అంటే ఏంటి..? ఆ పేరుతో ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా..?
Gold

Updated on: Dec 17, 2025 | 11:28 AM

భారతీయులకు బంగారంపై ఎంత మక్కువ ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లి, ఫంక్షన్, పండుగ ఏదైనా ముందు బంగారం గురించే చర్చ జరుగుతుంది. ఇలాంటి సమయాల్లో బంగారం ధరించి అందరిలో లగ్జరీగా కనిపించేందుకు తహతహలాడుతుంటారు. బంగారంలో చాలా రకాలు ఉన్నాయి. 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం అని మీరు వింటూ ఉంటారు. బంగారం కొనుగోలు చేసేటప్పుడు లేదా పెట్టుబడి పెట్టేటప్పుడు మీరు వీటి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతున్న క్రమంలో దీని గురించే అందరూ చర్చించుకుంటున్నారు. అసలు 24 క్యారెట్ల బంగారం అంటే ఏమిటి..? అందులో 999 లేదా 995 మధ్య తేడాలేంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

24 క్యారెట్లు అంటే..

బంగారం స్వచ్ఛతను రెండు విధానాల్లో కొలుస్తారు. ఒకటి క్యారెట్లు, రెండోవది సూక్ష్మత. క్యారెట్ అనేది ఇతర లోహాలతో కలిపిన బంగారం స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. 24 క్యారెట్ల బంగారంలో ఇతర లోహాలను కలపరు. అందుకే దీనిని ఫ్యూర్ గోల్డ్‌గా పరిగణిస్తారు. వాస్తవానికి బంగారం పూర్తిగా స్వచ్చమైనదిగా ఉండదు. అత్యధిక స్థాయి స్వచ్చత కలిగిన దానిలో వెయ్యిలో 999.9 భాగం బంగారం ఉంటుంది.

999, 995 మధ్య తేడా ఏంటి..?

వెయ్యి గ్రాముల బంగారం స్వచ్ఛత స్థాయిలను 999, 995 ద్వారా అంచనా వేస్తారు. వెయ్యి గ్రాముల బంగారంలో 995 స్వచ్చత అంటే అర్థం ఏంటంటే.. మీరు తీసుకునే 995 గ్రాముల గోల్డ్‌లో 5 గ్రాములు వేరే లోహం ఉంటుంది. ఇక 999 స్వచ్ఛత అంటే ఒక గ్రాము వేరే లోహం ఉంటుంది. ఇక 999.9 స్వచ్ఛత అంటే.. కేవలం 0.1 గ్రాము మాత్రమే వేరే లోహం ఉంటుంది. 999 అనేది అనేది బంగారంలో అత్యధిక స్వచ్చత. ఇలాంటి బంగారాన్ని కాయిన్స్ లేదా కడ్డీలలో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగిస్తారు. దీనినే బులియన్ అని పిలుస్తారు. 995 స్వచ్చత కలిగిన బంగారం 24 క్యారెట్లగా పరిగణించినప్పటికీ.. 999 కంటే అది పూర్తిగా స్వచ్ఛమైనదిగా ఉండదు.

ధర ఎలా నిర్ణయిస్తారు..?

బంగారం స్వచ్ఛతను బట్టి రేటు నిర్ణయిస్తారు. 22 క్యారెట్ల బంగారం కంటే 24 క్యారెట్ల బంగారం స్వచ్చత ఎక్కువగా ఉంటుంది. అందుకే 22 క్యారెట్ల కంటే 24 క్యారెట్ల గోల్డ్ రేటు ఎక్కువగా ఉంటుంది. ఇక 995 కంటే 999 స్వచ్ఛత కలిగిన గోల్డ్ రేటు అధికంగా ఉంటుంది. 995 క్వాలిటీ కంటే 999 స్వచ్చత కలిగిన బంగారం 0.4 శాతం ఎక్కువ రేటు ఉంటుంది. ఉదాహరణకు 995 స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.100 ఉంటే 999 క్వాలిటీది రూ.100.40గా ఉంటుంది.
.