
గత పది రోజులుగా బంగారం ధర పెరుగుతూ తగ్గుతూ వస్తోంది. మరి కొన్ని రోజుల్లో ఇంకా తగ్గి లక్ష రూపాయలకు చేరుకుంటుందని ఒక అంచనా. మార్కెట్లో కరెన్సీ కొరత, పెట్టుబడిదారులు బంగారాన్ని అమ్మాల్సి రావడం, అమెరికా డాలర్ బలపడటం వంటి వివిధ కారణాల వల్ల బంగారం ధరలు తగ్గుతున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే ధరలు తగ్గడంవ మంచి పెట్టుబడి అవకాశంగా కొందరు చూస్తుంటే వారెన్ బఫెట్ మాత్రం బంగారాన్ని నమ్మొద్దు అంటున్నారు. ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ ఎలాంటి ఉపయోగం లేదంటున్నారు.
బంగారంలో పెట్టుబడి పెట్టడం సురక్షితమని చాలామంది ఆర్థిక నిపుణులు చెప్తున్నందున చాలామంది బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు. కానీ, ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన వారెన్ బఫెట్ బంగారాన్ని ఎప్పటికీ సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించలేమని చెప్పారు. ఆయన ఇప్పుడే కాదు, గతం నుంచి ఇదే వాదన వెల్లబుచ్చుతూ ఉన్నారు. బంగారం మంచి పెట్టుబడి కాదని, దాంతో ఎలాంటి ఉపయోగం లేదని చెప్తున్నారు.
బంగారంతో సృజనాత్మకంగా ఏమీ చేయలేరనేది వారెన్ బఫెట్ అభిప్రాయం. ప్రపంచంలోని 170,000 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కరిగించి ఒకే బ్లాక్‌గా చేస్తే, అది కేవలం 63 క్యూబిక్ అడుగుల పదార్థం అవుతుంది. దాన్ని చూసి ఆశ్చర్యపోవడం తప్ప పెద్దగా ఉపయోగం మాత్రం లేదు అనేది ఆయన వాదన. “ భవిష్యత్తులో ధర పెరుగుతుందనే భావనతోనే చాలామంది బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఇది తప్పు. బంగారానికి అంతర్గత విలువ లేదు. అంటే ఒక పరిశ్రమ లాగా, వ్యాపారం లాగా, బంగారం సమాజానికి ప్రయోజనం చేకూర్చదు. కాబట్టి ఇది ఎప్పటికీ మంచి పెట్టుబడి కాదు” అని బఫెట్ పేర్కొన్నారు. అయితే ఈయన వ్యాఖ్యలకు నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. బఫెట్ చెప్పింది అక్షరాలా సత్యం అని కొందరు అంటుంటే బంగారం మంచి పెట్టుబడి అని కొందరు వాదిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.