Indian Railway: దేశంలో అతిపెద్ద రవాణ వ్యవస్థ అంటే అది రైల్వే అనే చెప్పాలి. ప్రతి రోజు లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. అందులో ఛార్జీలు తక్కువ ఉండటంతో సామాన్య జనాలు కూడా రైలు ప్రయాణం వైపే మొగ్గు చూపుతుంటారు. అయితే ఎక్కడికైనా ప్రయాణాలు ప్లాన్ చేసుకున్నప్పుడు రిజర్వేషన్ లభిస్తుందో లేదోనని ముందుగానే ఐఆర్‌సీటీసీలో, లేదా రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్లలో టికెట్స్ బుక్ చేయడం రైల్వే ప్రయాణికులకు అలవాటు. ఎక్కువగా ఆన్‌లైన్ ద్వారానే బుక్ చేసుకుంటారు. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు, పండుగ సీజన్లలో రైలు టికెట్లు దొరకడం చాలా కష్టం. అందుకే చాలా అడ్వాన్స్‌డ్‌గా రిజర్వేషన్ చేస్తుంటారు.
టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత ఏవైనా మార్పులు ఉంటే ట్రైన్ టికెట్స్ రద్దు చేస్తుంటారు. రైలు టికెట్ రద్దు చేస్తే క్యాన్సలేషన్ ఛార్జీలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ ఛార్జీల గురించి అవగాహన లేక ప్రయాణికులు భారీగా నష్టపోతుంటారు. రైలు టికెట్ ఎప్పుడు రద్దు చేస్తే ఎంత ఛార్జ్ చెల్లించాలో పెద్దగా అవగాహన ఉండదు. భారతీయ రైల్వే ఐఆర్‌సీటీసీ (IRCTC) క్యాన్సలేషన్ పాలసీ, రీఫండ్ ప్రాసెస్ లాంటి వివరాలను తమ వెబ్‌సైట్స్‌లో వెల్లడించాయి. ఐఆర్‌సీటీసీ టికెట్ రద్దు, రీఫండ్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
రైలు టికెట్స్ రద్దు చేస్తే ఎంత రీఫండ్ వస్తుందన్న విషయం రైలు టికెట్ రద్దు చేసే సమయంపై ఆధారపడి ఉంటుంది. అంటే రైలు బయలుదేరడానికి ఎంత ముందుగా టికెట్ రద్దు చేస్తే అంత ఎక్కువ రీఫండ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక షెడ్యూల్ ప్రకారం రైలు బయలుదేరడానికి 30 నిమిషాల్లో రైలు టికెట్ రద్దు చేస్తే రీఫండ్ ఏమీ రాదు. రైలు బయలుదేరడానికి 12 గంటల నుంచి 48 గంటల మధ్య టికెట్‌ను రద్దు చేసుకుంటే టికెట్ ధరలో 25 శాతం లేదా రూ.60 వీటిలో ఏది ఎక్కువ అయితే అది ఛార్జీగా చెల్లించాలి. అదే రైలు బయలుదేరడానికి 4 గంటల నుంచి 12 గంటల మధ్య లేదా రద్దు చేసుకుంటే 50 శాతం అంటే సగం డబ్బులు, జీఎస్టీ మినహాయింపు ఉంటుంది. రైలు బయల్దేరడానికి 48 గంటల ముందు టికెట్ రద్దు చేస్తే ఛార్జీలు వేర్వేరుగా ఉన్నాయి. సెకండ్ క్లాస్ టికెట్‌కు రూ.60, సెకండ్ స్లీపర్ క్లాస్‌కు రూ.120, ఏసీ త్రీ టైర్ టికెట్‌కు రూ.180, టూ టైర్ టికెట్‌కు రూ.200, ఫస్ట్ ఏసీ ఎగ్జిక్యూటీవ్ క్లాస్ టికెట్‌కు రూ.240 రద్దు ఛార్జీగా చెల్లించాలి. తత్కాల్ కేటగిరీలో బుక్ చేసిన కన్ఫర్మ్ టికెట్ రద్దు చేస్తే రీఫండ్ రాదు.
మరి రైళ్లు రద్దయితే ఛార్జీలు వర్తి్స్తాయా అన్న అనుమానాలు ప్రయాణికుల్లో కలుగవచ్చు. వరదలు, ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు, ఇతర కారణాల వల్ల రైళ్లు రద్దవుతుంటాయి. అలాంటి సమయంలో టికెట్స్ బుక్ చేసుకున్నవారి పరిస్థితి ఏమిటి..? రైళ్లు రద్దయితే ఆ రైళ్లల్లో అప్పటికే టికెట్లు బుక్ చేసి ప్రయాణికులకు పూర్తి రీఫండ్ వస్తుంది. ఈ డబ్బులు కూడా రెండు, మూడు రోజుల్లో క్రెడిట్ అవుతాయి.