ప్రయాణీకులకు మరో గుడ్ న్యూస్ అందించింది రైల్వేశాఖ. మార్చి 2024 నాటికి వందేభారత్ స్లీపర్ సర్వీసులు ప్రారంభమవుతాయని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన డిజైన్లు చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో రూపొందిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ కల్లా డిజైన్లు ఖరారు చేసి.. రైలు కోచ్‌ల తయారీని ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. వచ్చే ఏడాది మార్చికల్లా పలు వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేలా చర్యలు తీసుకుంటోంది. వీటిని సుదూర ప్రాంతాల మధ్య రాత్రింబవళ్ళు తిరిగేలా అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఇక ప్రస్తుతం వందేభారత్ సర్వీసులు చైర్ కార్ కోచ్‌లతో నడుస్తోన్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. వందేభారత్ రైళ్లల్లో మూడు రకాలు ఉన్నాయని.. అవి వందే మెట్రో, వందే చైర్ కార్, వందే స్లీపర్ అని కేంద్ర రైల్వేశాఖ తెలిపింది. ఇవన్నీ కూడా వచ్చే ఫిబ్రవరి-మార్చి నాటికి ప్రయాణీకులకు అందుబాటులోకి తెస్తామని గత నెలలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించిన ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతోన్న విషయం విదితమే.