
తెలగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్. అతి త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైలు ఇక్కడ కూడా అందుబాటులోకి రానుంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. ఢిల్లీ-సికింద్రాబాద్ మధ్య నడిపేందుకు రంగం సిద్దమవుతున్నట్లు సమాచారం. దక్షిణ మధ్య రైల్వే నుంచి దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఇందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్-ఢిల్లీ మధ్య ప్రారంభిస్తే ప్రయాణికులకు సేవలు మరింత మెరుగుపర్చవచ్చని రైల్వేశాఖ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే రాజధాని, దురంతో ఎక్స్‌ప్రెస్ హైస్పీడ్ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నప్పటికీ.. వందే భారత్ స్లీపర్ రైలు ప్రవేశపెడితే మరింత వేగంగా ప్రయాణించవచ్చు. దీని వల్ల ప్రయాణ సమయం తగణీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం సికింద్రాబాద్-ఢిల్లీ మధ్య రాజధాని ఎక్స్‌ప్రెస్ ఉండగా.. ఇందులో 1700 కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు 22 నుంచి 24 గంటల వరకు సమయం పడుతుంది. అయితే వందే భారత్ స్లీపర్ రైలు ఈ ప్రాంతాల మధ్య అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం కనీసం 3 నుంచి 4 గంటలు తగ్గనుంది. అందేకాకుండా రాత్రుల్లో సౌకర్యవంతంగా సదూర ప్రయాణం చేయవచ్చు.
హైదరాబాద్ నుంచి బిజినెస్, ఎడ్యుకేషన్, వ్యక్తిగత పనుల కోసం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఢిల్లీ వెళ్తుంటారు. ఈ రూట్లలో నడిచే రైళ్లకు రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో వందే భారత్ స్లీపర్ రైలు ప్రవేశపెడితే మరింత ప్రయోజనకరంగా ఉండనుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రైల్లో వెళ్లాలంటే ఒకరోజు పడుతుంది. అదే వందే భారత్ స్లీపర్ వస్తే ప్రయాణం సమయం భారీగా తగ్గనుంది. జనవరిలో దేశంలోనే తొలి వందే భారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అస్సాంలోని గువహతి నుంచి పశ్చిమబెంగాల్‌లోని హౌరా వరకు ఈ రైలును నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఇందులో ఛార్జీల వివరాలను కూడా విడుదల చేసింది. మరో 10 రోజుల్లో మోదీ దీనిని ప్రారంభించనున్నారు.