వందే భారత్‌ స్లీపర్‌ రైలు లాంచ్‌ వాయిదా..! టెస్ట్‌ రన్‌ తర్వాత రైల్వే మంత్రి ప్రకటన! కారణం ఏంటంటే..?

వందే భారత్ స్లీపర్ రైలు లాంచ్ డిసెంబర్‌కు వాయిదా పడింది. టెస్టింగ్ సమయంలో కొన్ని సమస్యలు తలెత్తడంతో బోగీలు, సీట్లు, ప్రయాణీకుల సౌకర్యాలకు సంబంధించిన మార్పులు చేస్తున్నారు. భద్రత, ఆధునిక ఫీచర్లకు ప్రాధాన్యత ఇస్తూ, రైలు ఫర్నిషింగ్‌ లో మార్పులు చేయనున్నారు.

వందే భారత్‌ స్లీపర్‌ రైలు లాంచ్‌ వాయిదా..! టెస్ట్‌ రన్‌ తర్వాత రైల్వే మంత్రి ప్రకటన! కారణం ఏంటంటే..?
Vande Bharat

Updated on: Nov 20, 2025 | 9:55 PM

భారతీయ రైల్వేస్‌కే ప్రత్యేకంగా నిలుస్తున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ లెటెస్ట్‌ వెర్షన్‌ అయిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ లాంచ్‌ వాయిదా పడింది. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ లగ్జరీ స్లీపర్ రైలును వచ్చే డిసెంబర్‌లో ప్రారంభిస్తామని చెప్పారు. వందే భారత్ స్లీపర్ రైలు మొదటి రేక్‌ను పరీక్షించే సమయంలో కొన్ని చిన్న సమస్యలు ఎదురయ్యాయని కేంద్ర మంత్రి తెలిపారు. దీంతో బోగీలు, సీట్లు, ప్రయాణీకుల సౌకర్యాలకు సంబంధించి కొన్ని మార్పులు చేయాల్సి ఉంది. ఈ మార్పులన్నీ వేగంగా పూర్తి చేసి డిసెంబర్‌లో వందే భారత్‌ రైళ్లను పట్టాలు ఎక్కిస్తామని అన్నారు.

ఈ మార్పులు చిన్నవే అయినప్పటికీ వాటిని చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు రైల్వే మంత్రి వెల్లడించారు. వందే భారత్ స్లీపర్ రైళ్లను తయారు చేసే BEML, ప్రోటోటైప్ రేక్‌ను రెట్రోఫిట్టింగ్ కోసం తమకు తిరిగి ఇచ్చినట్లు ధృవీకరించింది. ఈ రైలు RDSO, రైల్వే భద్రతా కమిషనర్ పర్యవేక్షణలో టెస్ట్‌ రన్‌లు నిర్వహించారు. BEML అధికారి ఒకరు చెప్పిన దాని ప్రకారం.. ఇది ఒక నమూనా కాబట్టి అన్ని భద్రత, సౌకర్య పారామీటర్స్‌పై విస్తృతమైన టెస్టులు చేస్తారని, ఆ తర్వాత సూచించిన అన్ని మార్పులు చేస్తారని తెలుస్తోంది.

RDSOకి రాసిన లేఖలో రైల్వే మంత్రిత్వ శాఖ భవిష్యత్ రైళ్లలో కొత్త AC డక్ట్ లొకేషన్లు, అగ్ని భద్రత కోసం ఆర్క్-ఫాల్ట్ డిటెక్షన్ పరికరాలు, CCTV కోసం ఫైర్-సర్వైవల్ కేబుల్స్, యూరోపియన్ ఫైర్, క్రాష్ ప్రమాణాలకు వ్యతిరేకంగా థర్డ్-పార్టీ ఆడిట్‌లు, అత్యవసర అలారం బటన్‌ల కోసం కొత్త స్థానాలు వంటి అనేక ముఖ్యమైన మార్పులు ఉంటాయని పేర్కొంది. దీనితో పాటు రైలు ఫర్నిషింగ్, పనితనంలో కూడా మెరుగుదలలు జరుగుతున్నాయి.

స్లీపర్ కోచ్ నిర్వహణ సౌకర్యం

దీనికి సంబంధించిన పరిణామంలో భారత్‌లో మొట్టమొదటి వందే భారత్ రైలు స్లీపర్ కోచ్ నిర్వహణ సౌకర్యం 2026 మధ్య నాటికి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో సిద్ధంగా ఉండనుంది. భగత్ కి కోఠి రైల్వే స్టేషన్‌లోని అత్యాధునిక సౌకర్యానికి బడ్జెట్‌లో రూ.360 కోట్లు కేటాయింపులు జరుగుతాయని నార్త్ వెస్ట్రన్ రైల్వే సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ అమిత్ స్వామి తెలిపారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us