Traffic Rules: బైక్‌పై వెళ్లేటప్పుడు ఇవి పెట్టుకుంటున్నారా..? జాగ్రత్తగా ఉండాల్సిందే.. లైసెన్స్ రద్దు..!

ట్రాఫిక్ నిబంధనలను కొంతమంది పాటించరు. ఇలాంటివారి వల్ల తొలి వాహనదారులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక యువకులు అయితే సైలెన్సర్ల శబ్దంతో ప్రజలకు రోడ్లపై ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

Traffic Rules: బైక్‌పై వెళ్లేటప్పుడు ఇవి పెట్టుకుంటున్నారా..? జాగ్రత్తగా ఉండాల్సిందే.. లైసెన్స్ రద్దు..!
Traffic Challan New Rules 2026

Updated on: Jun 17, 2026 | 12:35 PM

వాహనదారుల భద్రత కోసం ట్రాఫిక్ పోలీసులు అనేక ట్రాఫిక్ నిబంధనలను అమలు చేస్తున్నారు. వీటిని ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ నియమాల పట్ల వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్స్ ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు కూడా చేపడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడినవారికి జరిమానా విధించడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం లాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని పరిస్థితుల్లో బైక్ కూడా సీజ్ చేస్తున్నారు. అయినా కొంతమంది వాహనదారులు మితిమిరీ ప్రవర్తిస్తున్నారు. బైక్ సైలెన్సర్లను తీసేయడం, విపరీతమైన సౌండ్ వచ్చే వాటిని బిగించడం లాంటివి చేస్తున్నారు.

సైలెన్సర్లు బిగించుకుంటున్నారా..?

కొంతమంది యువకులు భారీ సౌండ్ వచ్చే సైలెన్సర్లను బిగించుకుని రోడ్లపై ప్రజలు, వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇలాటి వికృత చేష్టల వల్ల వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం లాంటివి పెరుగుతున్నాయి. భారీ శబ్దాల వల్ల ప్రజలు భయపడిపోతున్నారు. దీంతో పాటు కొంతమంది బైక్‌లకు హై బీమ్ లైట్లను బిగించుకుంటున్నారు. దీని వల్ల ఎదురుగా వచ్చే వాహనాలదారుల కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఎదురుగా వచ్చే వాహనదారులు ఈ లైటింగ్స్ వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో కంపెనీ వాహనానికి వచ్చే సైలెన్సర్లు కాకుండా వేరేవి బిగించుకోవడం, హై బీమ్ లైట్లను అమర్చుకోవడం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి పనులకు పాల్పడేవారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పట్టుబడితే ఇలాంటి వాటిని తొలగించడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తున్నారు.

మొబైల్ స్టాండ్లు పెట్టుకుంటున్నారా..?

ఇక కొంతమంది బైక్‌కు మొబైల్ స్టాండ్లు పెట్టుకుంటున్నారు. స్టాండ్లకు మొబైల్ బిగించుకుంటున్నారు. కొంతమంది బైక్‌పై డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్డును చూడకుండా మొబైల్ ఫోన్లను చూస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఇలా బైక్ డ్రైవ్ చేయవద్దని పోలీసులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు బైక్‌కు పెట్టుకున్న మొబైల్ స్టాండ్లను పీకేస్తున్నారు. మోడిపైడ్ సైలెన్సర్లు, హైబీమ్ లైట్లు వాడినా 190 (ii) మోటార్ వాహనాల చట్టం 1988 ప్రకారం చర్యలు ఉంటాయి. తొలిసారి పట్టుబడితే రూ.10 వేల జరిమానా లేదా మూడు నెలల జైలుశిక్ష ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ కూడా జప్తు చేస్తారు. రెండోసారి కూడా అదే తప్పు చేస్తే ఆరు నెలల జైలుశిక్ష లేదా రూ.10 వేల ఫైన్ ఉంటుంది. అంతేకాకుండా వాహనాన్ని కూడా సీజ్ చేస్తారు.

Follow Us