UPI చెల్లింపుల్లో మనమే టాప్‌..! రోజుకు ఎన్ని కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయంటే..?

భారతదేశం యూపీఐ చెల్లింపులలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. ప్రతి నెల 1800 కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి. జూన్ 2024లో 24.03 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు నమోదయ్యాయి. 49.1 కోట్ల మంది ప్రజలు, 6.5 కోట్ల మంది వ్యాపారులు యూపీఐని ఉపయోగిస్తున్నారు.

UPI చెల్లింపుల్లో మనమే టాప్‌..! రోజుకు ఎన్ని కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయంటే..?
Upi

Updated on: Jul 21, 2025 | 11:58 AM

ఇప్పుడంతా డిజిటల్‌ కాలం అయిపోయింది. ఫిజికల్‌ క్యాష్‌ తీసుకోవడం ఇవ్వడం చాలా వరకు తగ్గిపోయిందనే చెప్పాలి. చిన్నా పెద్దా అన్ని అవసరాలకు కూడా యూపీఐనే వాడేస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు పెరిగిపోయారు. అందుకు తగ్గట్టే.. డిజిటల్‌ చెల్లింపులు కూడా భారీగా పెరిగాయి. ఎంతలా అంటే యూపీఐ లావాదేవీల్లో ప్రపంచంలోనే ఇండియా నంబర్‌ వన్‌గా నిలిచింది. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌(IMF) సంస్థ తన నివేదికలో వెల్లడించింది.

నేడు మన దేశంలో ప్రతి నెలా 1800 కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయని ఐఎంఎఫ్‌ తెలిపింది. ఈ ఏడాది జూన్‌లో రూ.24.03 లక్షల కోట్లు యూపీఐ ద్వారా బదిలీ అయ్యాయి. మొత్తం 18.39 బిలియన్‌ లావాదేవీలు నమోదయ్యాయి. 2024లో ఇదే నెలలో 13.88 బిలియన్‌ లావాదేవీలు కాగా.. ప్రస్తుతం 32 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుతం 49.1 కోట్ల మంది సామాన్య ప్రజలు, 6.5 కోట్ల మంది వ్యాపారులు ఈ యూపీఐ సేవలను వినియోగిస్తున్నారు. 675 బ్యాంకులు యూపీఐ సేవలను అందిస్తున్నాయి.

దేశంలో మొత్తం డిజిటల్‌ చెల్లింపుల్లో 85 శాతం యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. ప్రపంచంలో రియల్‌ టైమ్ డిజిటల్‌ చెల్లింపుల్లో 50 శాతం ఒక్క మన దేశంలోనే జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. భారత్‌తో పాటు యూఏఈ, సింగపూర్‌, భూటాన్‌, నేపాల్‌, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్‌ వంటి ఏడు దేశాల్లో యూపీఐ సేవలను అనుమతిస్తున్నాయి. బ్రిక్స్‌ సభ్యత్వ దేశాలకు యూపీఐని విస్తరించాలని రిజర్వు బ్యాంకు యోచిస్తోంది. సురక్షితమైన, వేగవంతమైన లావాదేవీల వల్ల యూపీఐ చెల్లింపులు ప్రజల్లో ఇంత ఆదరణ పొందాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి