
ఇటీవల యూపీఐ లావాదేవీలు రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి. రోజు కోట్ల సంఖ్యలో యూపీఐ బదిలీలు జరుగుతున్నాయి. టీ షాపుల దగ్గర చిన్న మొత్తాల నుంచి షాపింగ్స్ మాల్స్‌లో పెద్ద బదిలీల వరకు ప్రతీచోట యూపీఐ వాడకం పెరిగిపోయింది. అయితే కొన్నిసార్లు యూపీఐ ఫ్లాట్‌ఫామ్స్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. సర్వర్ డౌన్ కావడం, నెట్‌వర్క్ లోపాల కారణంగా డబ్బులు బదిలీ కావు. కొన్నిసార్లు మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినా రిసీవర్ ఖాతాలో జమ కావు. ఇలాంటి సమయంలో అకౌంట్లోకి డబ్బులు రీఫండ్ కాకపోవడం వల్ల యూపీఐ యూజర్లు ఆందోళన చెందుతుంటారు. ఇలాంటి సమయంలో ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం.
ముందుగా యూపీఐ యాప్ తెరవండి. మీ పాస్ బుక్ లేదా పేమెంట్ హిస్టరీని చెక్ చేయండి. లావాదేవీ స్టేటస్ ఫెయిల్డ్ లేదా పెండింగ్‌లో ఉందా అనేది తనిఖీ చేయండి. పేమెంట్ ఫెయిల్డ్ అని ఉండి మీ అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అయితే జాగ్రత్త పడంది. యూపీఐ చెల్లింపులు ఫెయిల్ అయినప్పుడు బ్యాంకులు ఆటోమేటిక్‌గా నగదును రీఫండ్ చేస్తాయి. కొన్నిసార్లు వెంటనే జమ అయితే.. మరికొన్నిసార్లు కొన్ని గంటల సమయం పట్టవచ్చు. ఒకటి నుంచి ఏడు రోజుల వరకు గడవు ఉంటుంది. ఈ గడువు తర్వాత కూడా డబ్బులు జమ కాకపోతే మీరు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ముందుగా మీరు డిజిటల్ రికార్డులను భద్రపర్చుకోండి. చెల్లింపు రసీదు, స్క్రీన్‌షాట్స్ దాచుకోండి. ఇక 12 అంకెల యూపీఐ రిఫరెన్స్ నెంబర్ నమోదు చేసుకోండి. మీ పేమెంట్ యాప్‌లోకి వెళ్లి సమస్యను నివేదించండి లేదా వివాదాన్ని లేవనెత్తండి అనే ఆప్షన్ ఎంచుకుని కస్టమర్ సపోర్ట్‌ను సంప్రదించండి.
ఒకవేళ యూపీఐ యాప్ సిబ్బంది పరిష్కరించకపోతే అనంతరం బ్యాంక్ కస్టమర్ సపోర్ట్ హెల్ప్ లైన్ లేదా నేరుగా బ్యాంక్‌ను సంప్రదించండి. అప్పటికీ మీకు నగదు అందకపోతే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు కంప్లైంట్ చేయండి. ఎన్‌పీసీఐ పోర్టల్ ద్వారా మీరు ఫిర్యాదు దాఖలు చేయవచ్చు. ఈ మార్గాల ద్వారా కూడా మీకు రీఫండ్ అందకపోతే 30 రోజుల తర్వాత ఆర్బీఐ బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించండి. ఒకవేళ సైబర్ నేరాల వల్ల మీరు డబ్బులు పొగోట్టుకుంటే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930ను సంప్రదించాలి. లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఈ ప్రక్రియలు పాటించడం ద్వారా మీరు డబ్బులు రీఫండ్ పొందే అవకాశముంది.