
ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా దీర్ఘకాలిక పెట్టుబడులకు(3-6 నెలలు) అనువైన ఐదు స్టాక్‌లను బిజినెస్ నిపుణులు వివరించారు. ఇది కేవలం అవగాహన కోసమేనని.. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు బిజినెస్ అడ్వైజర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు. మరి ఆ స్టాక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
బీఎస్ఈ ఇటీవల మంచి సానుకూల ఫలితాలను నమోదు చేసింది. గతంలో రూ. 3200 వరకు వెళ్ళిన ఈ స్టాక్, ప్రస్తుతం రూ. 2800 వద్ద ఉంది. రూ. 400 పాయింట్లు తగ్గడం వల్ల ఇది తీసుకోవడానికి మంచి ఆప్షన్ అంటున్నారు. రూ. 2800 వద్ద లేదా ఇంకా తగ్గినట్లయితే రూ. 2700- రూ. 2600 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఒకటి నుండి రెండు నెలల్లో రూ. 3200 టార్గెట్ చేయవచ్చునన్నారు. ఇది 150 సంవత్సరాల చరిత్ర కలిగిన కంపెనీ. స్థిరమైన లాభాలు, పెరుగుతున్న టర్నోవర్‌తో ఉంటుంది.
అంతకుముందు రూ. 2700 వరకు చేరుకున్న ఎంసీఎక్స్, ప్రస్తుతం రూ. 2300 వద్ద ఉంది. ఈ స్టాక్ 1:5 నిష్పత్తిలో స్ప్లిట్ అయింది. దాదాపు రూ. 500 పాయింట్లు తగ్గింది. గోల్డ్, సిల్వర్, కాపర్ వంటి కమోడిటీల ట్రేడింగ్‌లో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం రూ. 2300- రూ.2200 మధ్య పెట్టుబడి పెట్టవచ్చు. రూ. 2500- రూ. 2700 లక్ష్య ధరలను 3-6 నెలల్లో చేరుకోవచ్చు. ఇది భారతదేశంలో ఒక ప్రముఖ సంస్థ.
ఎస్‌బీఐ నిరంతరం వృద్ధి చెందుతూ ఉంది. ఫిబ్రవరి 2న రూ. 1000 వద్ద ఉన్న ఈ స్టాక్, అద్భుతమైన ఫలితాలతో రూ. 200 పాయింట్లు పెరిగి ప్రస్తుతం రూ. 1200 స్థాయిలో ఉంది. భారతదేశంలో నాలుగో లేదా ఐదో అతిపెద్ద కంపెనీగా ఇది వృద్ధి చెందుతోంది. ప్రస్తుత ధర రూ. 1200 వద్ద కొనుగోలు చేయవచ్చు. రూ. 1300 లక్ష్య ధరను రెండు, మూడు నెలల్లో చేరుకునే అవకాశం ఉంది. ఒకవేళ తగ్గితే రూ. 1100 వద్ద కూడా కొనుగోలు చేయవచ్చు. దీని ట్రెండ్ చాలా బాగుంది.
హెచ్‌ఏఎల్ గురించి అనేక ప్రతికూల వార్తలు వచ్చినా, ఇటీవల 30 శాతం లాభాలను నమోదు చేసింది. గతంలో రూ. 4800 వద్ద ఉన్న ఈ స్టాక్ ప్రస్తుతం రూ. 4200 వద్ద ఉంది. రూ. 4000 అనేది దీనికి బలమైన మద్దతు స్థాయి. మార్కెట్ పడిపోయినప్పటికీ ఇది రూ. 4000 వద్ద నిలబడగలదు. ఒకవేళ రూ. 4000 వద్దకు వస్తే కొనుగోలు చేయవచ్చు. రెండు, మూడు నెలల్లో రూ. 4500- రూ. 4600 లక్ష్య ధరలను చేరే అవకాశం ఉంది.
గోద్రెజ్ ప్రాపర్టీస్ రూ. 2200 నుండి రూ. 1500 వరకు పడిపోయి, ప్రస్తుతం రూ. 1800 వద్ద ఉంది. వీక్లీ చార్ట్, మొత్తం ట్రెండ్ సానుకూలంగా ఉన్నాయి. ప్రస్తుత ధర వద్ద ప్రవేశించవచ్చు లేదా రూ. 1700 వద్ద కొనుగోలు చేయవచ్చు. రూ. 2000 లక్ష్య ధరను చేరుకునే అవకాశం ఉంది. దీని అప్‌ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని విశ్లేషించారు.
ఈ ఐదు స్టాక్‌లు బీఎస్ఈ (ఎక్స్ఛేంజ్), ఎంసీఎక్స్ (కమోడిటీ ఎక్స్ఛేంజ్), ఎస్‌బీఐ (బ్యాంకింగ్), హెచ్‌ఏఎల్ (డిఫెన్స్), గోద్రెజ్ ప్రాపర్టీస్ (నిర్మాణం) వంటి విభిన్న రంగాలకు చెందినవి. కనీసం 3 నుండి 6 నెలల పాటు వీటిని హోల్డ్ చేయడం ద్వారా మంచి అవకాశాలు ఉంటాయని సూచించారు.