మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని కూరగాయలూ సెంచరీ మార్క్‌కు చేరువ అవుతున్నాయి. ధరలతో సామాన్యులు తిప్పలు పడుతున్నారు.. రూ.500 తీసుకెళ్తే ఐదారు రకాల కూరగాయలు తెచ్చుకోవడం కష్టంగా మారిందంటున్నారు వినియోగదారులు.. అయితే.. టమోటా ధరలు మాత్రం.. తగ్గేదేలేదంటూ భారీగా పెరుగుతున్నాయి. వాస్తవానికి టమోటా లేని కూర ఉండదనే చెప్పాలి. కూరల్లో ఉల్లికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అంతే ప్రాధాన్యత టమోటాకి కూడా ఉంటుంది. అలాంటి టమోటా ధరలు ఇప్పుడు అమాంతం పెరిగిపోయాయి. గడిచిన వారం రోజులుగా టమోటా ధర రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. పెరుగుతున్న టమోటా ధరతో వినియోగదారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ధర పెరగటానికి గల కారణాలు ఏంటో స్పష్టంగా తెలియడం లేదు. మార్కెట్ లో వ్యాపారులు, దళారీల మాయజాలమా? లేక డిమాండ్ కు తగ్గ సరఫరా లేకపోవడమే కారణమా అన్న విషయం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇటీవల కాలంలో ఉల్లి ధర అమాంతంగా పెరిగినట్లే ఇప్పుడు టమోటా ధర కూడా సెంచరీ కావడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్ టమాట కిలో ధర 80 నుంచి 100 వరకు పలుకుతోంది. అయితే.. టమోటో ఒక్కటే కాదు.. ఇతర కూరగాయల ధరలు కూడా మండిపోతున్నాయి.. మార్కెట్ లో దాదాపు అన్ని కూరగాయల ధరలు రూ.80వరకు పలుకుతున్నాయి..
కిలో టమోటా సెప్టెంబర్ మూడవ వారంలో 15 నుండి 20 రూపాయల వరకు ఉండేది. తరువాత సెప్టెంబర్ నాలుగవ వారానికి ఆ ధర 45 నుండి 50 రూపాయల వరకు పెరిగింది. ఇప్పుడు ఆ ధర 90 నుండి 100 రూపాయలకు చేరింది. ఈ ధర ఇంతటితో ఆగే అవకాశాలు లేవని మరింత పెరుగుతుందని అంటున్నారు వ్యాపారులు. పెరుగుతున్న టమోటా ధరతో కొందరు వ్యాపారులు, దళారీలు ఇదే అదునుగా తమ అక్రమ వ్యాపారాలకు పదును పెడుతున్నారు.
వ్యాపారులు టమోటాను కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇటీవల టమోటా ధర పెరిగిన సందర్భంలో వినియోగదారులు దాదాపు టమోటా వాడకం తగ్గించారు. ఇప్పటికే హోటల్స్, ఫాస్ట్ పుడ్ సెంటర్స్ లో టమోటా వాడకం తగ్గించారు. టమోటా ధర పెరగడంతో హోటల్ నిర్వాహకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెరుగుతున్న టమోటా ధరలను అదుపు చేయాలని కోరుతున్నారు వినియోగదారులు.
టమోటా ధరలు గణనీయంగా పెరుగుతున్న నేపధ్యంలో అధికారులు కూడా వెంటనే అప్రమత్తమై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ధర పెరగడానికి గల కారణాల పై విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం దసరా నవరాత్రులు కొనసాగుతున్నాయి. పండుగ కారణంగా టమోటా వాడకం కూడా పెరిగింది. అయితే వాడకానికి తగ్గ టమోటా లేకపోగా, ఉన్న టమోటా ధర కాస్త ఆకాశాన్ని అంటుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో టమోటా భారం తమ పై పడకుండా చూడాలని కోరుతున్నారు వినియోగదారులు..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..