Car Insurance: కారు కొనుగోలు చేస్తున్నారా.. ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు..

|

Sep 05, 2024 | 4:56 PM

కారు కొనుగోలు చేయాలనుకునే వారందరూ ముందుగా అనేక విషయాలను పరిశీలిస్తారు. ఏ కారు కొనాలి, ఏ కంపెనీ అయితే బాగుంటుంది, ధర ఎంతో ఉండాలి, ఆ కంపెనీ సర్వీసు సెంటర్లు, కారు నాణ్యత, మైలేజీ తదితర వాటిపై ఎంతో పరిశోధన చేస్తారు. ఆయా కంపెనీల షోరూమ్ లకు వెళ్లి పరిశీలించడంతో పాటు స్నేహితులు, బంధువులు, పరిచయస్తుల సలహాలను తీసుకుంటారు. వీటితో పాటు కారు కు బీమా తీసుకోవడం అత్యవసరం.

Car Insurance: కారు కొనుగోలు చేస్తున్నారా.. ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు..
Car Insurance
Follow us on

ప్రస్తుతం మధ్య తరగతి కుటుంబాలు కూడా సొంత కార్లను వినియోగిస్తున్నాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు, కుటుంబ అవసరాలతో పాటు కార్ల ధరలు కూడా అందుబాటులోకి రావడం దీనికి కారణం. అనేక కంపెనీల నుంచి నిత్యం పలు మోడళ్ల కార్లు మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి. కారు కొనుగోలు చేయాలనుకునే వారందరూ ముందుగా అనేక విషయాలను పరిశీలిస్తారు. ఏ కారు కొనాలి, ఏ కంపెనీ అయితే బాగుంటుంది, ధర ఎంతో ఉండాలి, ఆ కంపెనీ సర్వీసు సెంటర్లు, కారు నాణ్యత, మైలేజీ తదితర వాటిపై ఎంతో పరిశోధన చేస్తారు. ఆయా కంపెనీల షోరూమ్ లకు వెళ్లి పరిశీలించడంతో పాటు స్నేహితులు, బంధువులు, పరిచయస్తుల సలహాలను తీసుకుంటారు. వీటితో పాటు కారు కు బీమా తీసుకోవడం అత్యవసరం. దీనిపై కూడా ఎంతో శ్రద్ధగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. దీని కోసం మీకు ఉపయోగపడే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

బీమా రక్షణ చాలా అవసరం..

కొత్త కారును కొనుగోలు చేసినప్పుడు దానికి బీమా రక్షణ చాలా అవసరం. ఇది కారు నిర్వహణలో అత్యంత కీలకమైన అంశం. కానీ కొందరు ఈ విషయంపై శ్రద్ధ పెట్టరు. కానీ బీమాతో మీకు ఆర్థిక భద్రత కలుగుతుంది. అనుకోని ప్రమాదం జరిగినప్పడు అండగా ఉంటుంది. అయితే బీమా తీసుకునే ముందు అనేక అంశాలను పరిశీలించాలి. ఈ కింద తెలిపిన విషయాలను జాగ్రత్తగా పరిశీలించాలి.

కవరేజ్ రకాలు..

కారుకు తీసుకునే బీమాలో అనేక రకాల కవరేజ్ లు ఉంటాయి. దీనిలో ఒక్కొక్కటి ఒక్కో ప్రయోజనం కల్పిస్తాయి. థర్డ్ పార్టీ కవరేజ్ అనేది మీరు ఇతరులకు కలిగించే నష్టాలకు బాధ్యత వహిస్తుంది. కొలిషన్ కవరేజ్ అనేది ప్రమాదం జరిగినప్పుడు మీ వాహనాన్ని రక్షిస్తుంది. కాంప్రహెన్సివ్ (సమగ్ర) కవరేజ్ మీ కారు దొంగతనానికి గురైనా, ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా కలిగిన నష్టాన్ని భర్తీ చేస్తుంది. మన దేశంలో థర్డ్ పార్టీ, సమగ్ర కవరేజీలు ప్రముఖంగా ఉన్నాయి. వీటి ద్వారా అనేక ప్రయోజనాలతో పాటు భద్రత కలుగుతుంది.

మీ అవసరాలకు అనుగుణంగా..

మీ వ్యక్తిగత అవసరాలను అంచనా వేసుకుని, వాటికి అనుగుణంగా కారు బీమాను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీ వాహనం వయసు, దాని విలువ, మీ బడ్జెట్, మీ డ్రైవింగ్ అనుభవం దీనిలో కీలకంగా ఉంటాయి. మీ కొత్త కారు ఎక్కువ విలువ కలిగి ఉంటే సమగ్ర కవరేజీని పొందడం మంచిది. మరోవైపు పాత వాహనాలకు థర్డ్-పార్టీ లయబిలిటీ కవరేజ్ సరిపోతుంది.

పరిశీలన..

కార్ల బీమాను అనేక కంపెనీలు అందిస్తున్నాయి. ముందుగా వాటి పాలసీలను క్షుణ్ణంగా పరిశీలించాలి. పాలసీ ధర, కవరేజ్ ఎంపికలను సరిచూసుకోవాలి. చౌకైన పాలసీని ఎంచుకోవడంపై ఆసక్తి ఉన్నా, ఆ కంపెనీ చరిత్రను తెలుసుకోవడం చాలా అవసరం. ప్రసిద్ధ కంపెనీ అందించే బీమా పాలసీ కొంచెం ఖరీదైనా మెరుగైన సేవ లభించే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో (సీఎస్ఆర్)ని పరిశీలించాలి.

ఆర్థికంగా రక్షణ..

సాధారణంగా కార్లను బ్యాంకు లోన్ల ద్వారా కొనుగోలు చేస్తారు. వీటి కోసం ప్రతినెలా ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. రహదారిపై ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాలి. మీ తప్పు లేకపోయినా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కారు బీమా ద్వారా మీకు ఆర్థికంగా రక్షణ కలుగుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..