New Fund Offer: అధిక రాబడినిచ్చే ‘కొత్త ఫండ్ ఆఫర్’.. ఈ చిట్కాలు పాటిస్తే ఇక తిరుగుండదు..

|

Oct 04, 2024 | 4:23 PM

ఎన్ఎఫ్ వోను ప్రారంభించడం వెనుక కంపెనీలను వివిధ లక్ష్యాలు ఉంటాయి. పెట్టుబడిదారుల నుంచి నిధులు సేకరించడం, వాటిని స్టాక్ లు, బాండ్లు, ఇతర ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి వీటిని ప్రారంభిస్తాయి. ఇది ఐపీవోను పోలి ఉన్నప్పటికీ కొన్ని తేడాలు ఉన్నాయి. ముఖ్యంగా వీటిలో పెట్టుబడి ఎక్కువకాలం ఉంచాలి.

New Fund Offer: అధిక రాబడినిచ్చే ‘కొత్త ఫండ్ ఆఫర్’.. ఈ చిట్కాలు పాటిస్తే ఇక తిరుగుండదు..
Investments
Follow us on

మ్యూచువల్ ఫండ్స్ కు ప్రజల ఆదరణ చాలా బాగుంది. వాటిలో పెట్టుబడి పెట్టడానికి అనేక మంది ఆసక్తి చూపుతున్నారు. కొంచెం రిస్క్ ఉన్నప్పటికీ ధీర్ఘకాలంలో అధిక రాబడి సంపాదించే అవకాశం ఉండడంతో పెట్టుబడులు పెడుతున్నారు. అలాగే వీటిలో డబ్బులు ఇన్వెస్ట్ చేసేముందు స్టాక్ మార్కెట్ పై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. దానిపై కనీసం ప్రాథమికంగానైనా స్టాక్ లు, మార్కెట్ ఒడిదొడుకులు, రాబడి గురించి తెలుసుకోవాలి. స్టాక్ మార్కెట్ లో న్యూఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ వో) అనే ఒక విధానం ఉంది. ఒక అసెస్మెంట్ కంపెనీ (ఏఎంసీ) మార్కెట్ నుంచి షేర్లు, బాండ్లు, సెక్యూరిటీలు కొనుగోలు చేసేందుకు అవసరమైన నిధుల కోసం ఎన్ఎఫ్ వోకు వెళుతుంది. అయితే దీన్ని కొనుగోలు చేసేందుకు పెట్టుబడిదారులు కొన్ని విషయాలను జాగ్రత్తగా గమనించాలి.

ఎన్ఎఫ్‌వో అంటే..

న్యూఫండ్ ఆఫర్ ద్వారా కంపెనీలు మార్కెట్‌లోకి కొత్త మ్యూచువల్ ఫండ్‌ను తీసుకువస్తాయి. కొంత నిర్థిష్ట సమయం వరకూ మాత్రమే ఈ ఫండ్ ఆఫర్ ఉంటుంది. ఆ సమయంలోనే ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తారు. దీని ధర చాలా తక్కువగా ఉంటుంది. కేవలం రూ.500 నుంచి రూ.5 వరకూ మాత్రమే నిర్ణయిస్తారు. చిన్న ఇన్వెస్టర్లు ఇవి లాభదాయకంగా ఉంటాయి.

కంపెనీ లక్ష్యాలు..

ఎన్ఎఫ్ వోను ప్రారంభించడం వెనుక కంపెనీలను వివిధ లక్ష్యాలు ఉంటాయి. పెట్టుబడిదారుల నుంచి నిధులు సేకరించడం, వాటిని స్టాక్ లు, బాండ్లు, ఇతర ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి వీటిని ప్రారంభిస్తాయి. ఇది ఐపీవోను పోలి ఉన్నప్పటికీ కొన్ని తేడాలు ఉన్నాయి. ముఖ్యంగా వీటిలో పెట్టుబడి ఎక్కువకాలం ఉంచాలి. ప్రవేశించిన వెంటనే లాభాలు రావు. అలాగే కొత్త ఫండ్ పనితీరుపై మనకు స్పష్టత ఉండదు. దానికి సంబంధించిన ట్రాక్ రికార్డు లేకపోవడంతో అంచనా వేయలేము. అసెస్ మెంట్ కంపెనీకి ఆ ఫండ్ ను సమర్థంగా నిర్వహించే నైపుణ్యం ఉందో లేదో తెలియదు.

గమనించాల్సిన అంశాలు..

ఎన్ఎఫ్ వోలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి ఉన్నవారు కొన్ని విషయాలను జాగ్రత్తగా గమనించాలి. ఈ కింది తెలిపిన అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహనకు రావాలి.

పరిశీలన.. ఎన్ఎఫ్‌వోకు వచ్చి అసెస్మెంట్ కంపెనీ చరిత్రను పరిశీలించాలి. దాని ట్రాక్ రికార్డు, పనితీరును తెలుసుకోవాలి. స్థిరమైన పనితీరుతో ముందుకు సాగుతున్న కంపెనీ అయితే ఇబ్బంది ఉండదు.

పెట్టుబడి వ్యూహం.. ఎన్ఎఫ్‌వో పెట్టుబడి పెట్టడం వల్ల ఎంత ప్రయోజనం కలుగుతుందో అంచనా వేయాలి. దీర్ఘకాలంలో లాభదాయకంగా ఉండడంతో పాటు స్థిరమైన పనితీరు కనబర్చడం చాలా అవసరం. ముఖ్యంగా రాబడిని పొందటానికి ఎలాంటి లక్ష్యాలు పెట్టుకుందో తెలుసుకోవాలి.

ఫండ్ మేనేజర్ నైపుణ్యం.. ఫండ్ మేనేజర్ నైపుణ్యం, గతంలో పనితీరు చాాలా ప్రధానం. వాటిని తప్పకుండా పరిశీలించాలి. మంచి ట్రాక్ రికార్డు కలిగిన మేనేజర్ కారణంగా రాబడి బాగుంటుంది.

ఆదాయ వ్యయాలు.. ఎన్ఎఫ్‌వోలో పెట్టుబడికి ధీర్ఘకాలంలో రాబడి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇతర పండ్ లలో ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుందో తెలుసుకోవాలి. వాటి మధ్య తేడాలను గమనించాలి.

మార్కెట్ పరిస్థితులు.. ఫండ్ ను మార్కెట్ పరిస్థితులు ఎంతో ప్రభావితం చేస్తాయి. మార్కెట్ స్థితి, ఫండ్ అవకాశాలు వంటి వాటిని పరిశీలించాలి.

ఎన్ఎఫ్‌వోలు మనకు కొత్త పెట్టుబడి అవకాశాలను కల్పిస్తాయి. కానీ కంపెనీల పనితీరు బాగోలేకపోతే నష్టాలు వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడి పెట్టాలి. అవసరమైతే ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..