Atal pension yojana: ఇది సామాన్యుల పెన్షన్ పథకం..ప్రతి నెలా రూ.5 వేలు మీవే..!

ప్రతి ఒక్కరూ తమ విశ్రాంత జీవితం ప్రశాంతంగా, హాయిగా గడవాలని కోరుకుంటారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలని ఆశిస్తారు. దాని కోసం ఉద్యోగం చేస్తుండగానే వివిధ రిటైర్మెంట్ పథకాల్లో పెట్టుబడులు పెడతారు. వాటి నుంచి వచ్చే సొమ్ముతో వారికి రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భరోసా లభిస్తుంది. ఈ విధంగా ఉద్యోగులు, వ్యాపారులు జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ అసంఘటిత రంగ కార్మికులకు ఇవేమీ తెలియదు. వారికి రోజు వారీ వచ్చే కూలి తక్కువ కావడంతో జీవనానికే ఆ డబ్బులు సరిపోతాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి వారందరికీ అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) అండగా నిలబడుతోంది. ఆ పథకంలో ప్రతి నెలా రూ.5 వేలు పింఛన్ రావాలంటే ఏమి చేయాలో తెలుసుకుందాం.

Atal pension yojana: ఇది సామాన్యుల పెన్షన్ పథకం..ప్రతి నెలా రూ.5 వేలు మీవే..!
Pension

Updated on: Jun 01, 2025 | 5:30 PM

వీధి వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు, దినసరి కూలీలు, వ్యవసాయ కార్మికులు, బీడీ కార్మికులు, నేత కార్మికులు, మత్స్యకారులు, రిక్షా తొక్కేవారు.. వీరందరూ అసంఘటిత రంగ కార్మికుల కిందకు వస్తారు. వీరందరికి అటల్ పెన్షన్ యోజన పథకం వర్తిస్తుంది. దీనిలో చేరిన వారు చెల్లించే చందా, వారి వయసు ఆధారంగా నెలకు రూ.వెయ్యి నుంచి రూ.ఐదు వేల వరకూ పింఛన్ పొందవచ్చు. వయసు పెరిగిన తర్వాత శాశ్వత ఆదాయం లేనివారి కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు. అయితే ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్), ఈఎస్ఐసీ, జాతీయ పెన్షన్ పథకం (ఎన్ పీఎస్) పరిధిలో ఉన్నవారు అర్హులు కాదు. ఆదాయపు పన్ను చెల్లించే వారికి సైతం అవకాశం లేదు . ఇతర ప్రభుత్వ పింఛన్ పథకాల నుంచి ప్రయోజనాలు పొందకూడదు.

ఈ పథకంలో చేరిన వారికి 60 ఏళ్లు పూర్తయిన తర్వాత ప్రతి నెలా పింఛన్ వస్తుంది. ఆ మొత్తం మీ వయసు, మీరు కట్టే చందా బట్టి లెక్కిస్తారు. అయితే నెలకు రూ.2 వేలు పింఛన్ పొందే కేటగిరిలో ఉన్నవారు దాన్ని రూ.ఐదు వేలు పెంచుకునేందుకు అవకాశం ఉంది. దాని కోసం ఏపీవై ఖాతాను తెరిచిన బ్యాంకు శాఖ, ఆర్థిక సంస్థను సంప్రదించాలి. పింఛన్ పెంపునకు దరఖాస్తు పూర్తి చేయాలి. మీ వయసు, మీరు ఎంచుకున్న పింఛన్ ప్రకారం ప్రతినెలా ఎంత చందా కట్టాలో చెబుతారు. ఆ మొత్తం ప్రతి నెలా ఆటోమేటిక్ గా మీ బ్యాంకు ఖాతా నుంచి చెల్లించే ఎంపిక కూడా ఉంటుంది.

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 7.65 కోట్ల మందికి పైగా ప్రజలు అటర్ పెన్షన్ యోజన లో చేరారు. వీరి ద్వారా మొత్తం డిపాజిట్లు రూ.45,974.67 కోట్లకు పెరిగాయి. వీటిలో మహిళల భాగస్వామ్యం సుమారు 48 శాతం ఉండడం అభినందనీయం. దీని ద్వారా వారందరికీ ముసలితనంలో ఆర్థిక భరోసా లభిస్తుంది. అటల్ పెన్షన్ యోజనను 2015 మే నెలలో ప్రారంభించారు. దీన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్ డీఏ) కింద నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్ పీఎస్) ద్వారా నిర్వహిస్తారు. ఈ పథకానికి 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసున్న వారు అర్హులు. కనీసం 20 ఏళ్లు చందా చెల్లించాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..