Student loans: విదేశీ విద్య కోసం లోన్ కావాలా? ఈ బ్యాంకుల్లో ట్రై చేయండి.. సులభంగా వస్తుంది..

|

Jul 08, 2024 | 2:55 PM

విదేశాలలో చదువుకోవాలనే కలకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారతాయి. ట్యూషన్ ఫీజులు, జీవన వ్యయాలు, ఇతర ఇతర ఖర్చులు ఆందోళనను కలిగిస్తాయి. అయితే విదేశాలలో ఉన్నత విద్యను కలను బ్యాంకులు సాకారం చేస్తున్నాయి. ఇందుకోసం విద్యార్థులకు రుణాలు మంజూరు చేస్తున్నాయి. ట్యూషన్ ఫీజులు, వసతి, ప్రయాణం, ఇతర ఇతర ఖర్చులకు సంబంధించి రుణాలను పొందవచ్చు.

Student loans: విదేశీ విద్య కోసం లోన్ కావాలా? ఈ బ్యాంకుల్లో ట్రై చేయండి.. సులభంగా వస్తుంది..
Study Abroad
Follow us on

నేడు ప్రపంచం కుగ్రామంగా మారింది. విదేశాలకు వెళ్లడం సర్వసాధారణమైంది. మెరుగైన ఉపాధి, విద్య కోసం విదేశాల బాట పడుతున్నారు. విదేశాలలో ఉన్నత విద్యకు మెరుగైన అవకాశాలుండటం కూడా దీనికి కారణమవుతోంది. దీనివల్ల వ్యక్తిగతంగా అనేక విషయాలు తెలుసుకోవడం, ప్రపంచీకరణ నేపథ్యంలో మెరుగైన ఉద్యోగం, ఉపాధి అవకాశాలు పొందటానికి వీలు కలుగుతుంది. అయితే విదేశాలలో చదువుకోవాలనే కలకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారతాయి. ట్యూషన్ ఫీజులు, జీవన వ్యయాలు, ఇతర ఇతర ఖర్చులు ఆందోళనను కలిగిస్తాయి. అయితే విదేశాలలో ఉన్నత విద్యను కలను బ్యాంకులు సాకారం చేస్తున్నాయి. ఇందుకోసం విద్యార్థులకు రుణాలు మంజూరు చేస్తున్నాయి. ట్యూషన్ ఫీజులు, వసతి, ప్రయాణం, ఇతర ఇతర ఖర్చులకు సంబంధించి రుణాలను పొందవచ్చు.

అర్హతలు.. విదేశాలలో విద్యకు రుణాలను మంజూరు చేసే ముందు రుణదాతలు కొన్ని విషయాలను గమనిస్తారు. రుణం తీసుకోవడానికి ఇవి అర్హతా ప్రమాణాలు అన్ని చెప్పవచ్చు.

భారతీయ పౌరసత్వం.. విదేశాలలో చదువుకోవడానికి విద్యా రుణం కోసం దరఖాస్తు చేసుకునే వారు భారతీయ పౌరులుగా ఉండాలని రుణదాతలు భావిస్తున్నారు.

అడ్మిషన్ లేదా అంగీకార పత్రం.. విదేశాల్లోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి పొందిన అడ్మిషన్, అంగీకార పత్రాన్ని దరఖాస్తుదారులు అందజేయాలి.

వయో పరిమితి.. సాధారణంగా 18 నుంచి 35 ఏళ్ల లోపు విద్యార్థులకు రుణాలు ఇవ్వడానికే బ్యాంకులు ఆసక్తి చూపుతాయి.

కనీస విద్యా అర్హతలు.. దరఖాస్తుదారుని విద్యా అర్హతలను రుణదాతలు పరిశీలిస్తారు.

సెక్యూరిటీ.. రుణగ్రహీతలు నిర్దిష్ట మొత్తం కంటే ఎక్కువ రుణాల కోసం సహ దరఖాస్తుదారుని లేదా కొలేటరల్ సెక్యూరిటీని చూపాలి.

రుణాలు అందించే బ్యాంకులు..

విదేశీ విద్యకు రుణాలను అందించేందుకు దేశంలో అనేక బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్ బీఎఫ్ సీలు) ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన సంస్థల వివరాలు ఇలా ఉన్నాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. ఉద్యోగ ఆధారత, సాంకేతిక రంగాలకు సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్, మాస్టర్స్, డాక్టోరల్ ప్రోగ్రామ్‌ల కోసం ఎస్బీఐ రుణాలను అందిస్తుంది. ట్యూషన్ ఫీజులు, పరీక్ష, ల్యాబ్ ఖర్చులు, ప్రయాణం, భద్రతా డిపాజిట్లు, పుస్తకాలు, సప్లిమెంట్లు, రవాణా తదితర అన్ని ఖర్చులనూ రుణంలో అందజేస్తుంది.

హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. యూఎస్ఏ, కెనడా, జర్మనీ తదితర దేశాలకు హెచ్డీఎఫ్సీ క్రెడిలా నుంచి రుణాలు తీసుకోవచ్చు. వీసా ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే రుణ ఆమోదాన్ని నిర్ధారిస్తూ స్ట్రీమ్‌లైన్డ్ అప్లికేషన్ ప్రాసెస్‌ను అందిస్తుంది. అలాగే ఇళ్లు, ఫ్లాట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇతర ఆస్తులను హామీగా కూడా పెట్టుకోవచ్చు.

యాక్సిస్ బ్యాంక్.. విదేశాలలో లేదా భారతదేశంలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు రుణాలు మంజూరు చేస్తుంది. ట్యూషన్ ఫీజులు, రవాణా, వీసాలు, పుస్తకాలు.. ఇలా అన్ని ఖర్చులకూ సరిపడే రుణాన్ని అందిస్తుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్ బీ).. విదేశాలలో అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, మాస్టర్స్, డాక్టరల్ స్టడీస్ అభ్యసించే విద్యార్థులకు ఉడాన్ పథకంలో విద్యా రుణాలను అందజేస్తుంది. ట్యూషన్ ఫీజులు, రవాణా, వీసాలు, పుస్తకాలు, సామగ్రి తదితర అనేక ఖర్చులను కవర్ చేస్తూ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.

కెనరా బ్యాంక్.. జాబ్ ఓరియెంటెడ్, టెక్నికల్, ప్రొఫెషనల్, ఎస్టీఈఎమ్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల కోసం రుణాలను అందిస్తుంది. ట్యూషన్ ఫీజు, హౌసింగ్, పరికరాలు, ప్రయాణ ఖర్చులతో సహా అనేక ఖర్చులను కవర్ చేస్తుంది.

గమనించాల్సిన అంశాలు..

  • ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి విదేశీ విద్యా రుణాలను తీసుకోవడం ఉత్తమం. ఇవి ప్రైవేట్ బ్యాంకుల కంటే తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు మంజూరు చేస్తాయి.
  • కొందరు రుణదాతలు విద్యా రుణాల కోసం చెల్లించే వడ్డీపై పన్ను ప్రయోజనాలు, తగ్గింపులను అందించవచ్చు.
  • వివిధ రుణదాతలు అందించే ఈఎమ్ఐ (ఈక్వేటెడ్ నెలవారీ వాయిదా)లు, తిరిగి చెల్లింపు వ్యవధిని అంచనా వేయాలి. ఎక్కువ కాలం వాయిదాలతో నెలవారీ చెల్లించే మొత్తం తగ్గుతుంది.
  • రుణాల మంజూరు చేయడానికి వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజులు, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు, ఇతర రుసుములను పరిశీలించాలి.
  • కోర్సు పూర్తయిన తర్వాత 6 నెలల నుంచి ఏడాది వరకూ మారటోరియం వ్యవధి ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థులు రుణాలను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. మారటోరియం వ్యవధి తర్వాత రుణాన్ని ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల వరకూ చెల్లించే అవకాశం ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..