ఆటోమొబైల్స్ మార్కెట్ ముఖచిత్రం మారుతోంది. ఎప్పుడు సౌండ్ చేసుకుంటూ తిరిగే ఇంజిన్లకు కాలం చెల్లుతోంది. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు క్రమంగా సంప్రదాయ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వాహనాల స్థానాన్ని భర్తీ చేస్తున్నాయి. ముఖ్యంగా కార్లు, స్కూటర్లు వేగంగా విస్తరిస్తున్నాయి. సాధారణంగా కారు, లేదా స్కూటర్ మరేదైనా వాహనానికి నిర్వహణ(మెయింటెనెన్స్) అనేది చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా ఆయిల్స్ మార్చుకోవడం, సర్వీసింగ్ చేసుకోవడం చేస్తుండాలి. ఎందుకంటే సంప్రదాయ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ అనేది తిరిగే యత్రం. అందువల్ల దానికి అధికంగా మెయింటెనెన్స్ అవసరం అవుతుంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు ఆ బాధ ఉండదు. చాలా తక్కువ మెయింటెనెన్స్ అవసరం ఉంటుంది. ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. అయినప్పటికీ కొంత నిర్వహణ అయితే ఏ వాహనానికి అయినా అవసరమే. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్ల మెయింటెనెన్స్ ఎలా? సులభంగా వాటిని నిర్వహించడంలో ఉపయోగపడే టిప్స్ మీకు అందిస్తున్నాం.. ఓ లుక్కేయండి..
ఎలక్ట్రిక్ కారులో మెయింటెనెన్స్ అంటే మొదటిగా చూడాల్సిన ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ ప్యాక్. ఆ తర్వాత సస్పెన్షన్, బ్రేకింగ్ వ్యవస్థ, స్టీరింగ్ వంటి ఇతర భాగాలు కూడా క్రమం తప్పకుండా తనఖీ చేసుకుంటూ ఉండాలి.
బ్యాటరీ ప్యాక్.. ఈవీలోని బ్యాటరీ ప్యాక్ లు అధిక మన్నికతో వస్తాయి. ఇవి దీర్ఘకాలం పనిచేసేలా ఉంటాయి. అయితే ఆ బ్యాటరీ ప్యాక్ తయారీదారు సూచించిన నిర్వహణ, చార్జింగ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించడం ముఖ్యం. అంతేకాక కొన్ని చిట్కాలను ఉపయోగించి బ్యాటరీ లైఫ్ ను పెంచుకునే వీలుంటుంది. అవేంటంటే.. మీరు మీ కారు బ్యాటరీని పూర్తిగా అయిపోనివ్వొద్దు. అలాగే ఎక్కువ ఉష్ణోగ్రతల మధ్య బ్యాటరీని చార్జ్ చేయవద్దు. అలాగే ఎక్కువ గంటల పాటు కారు నిరాటకంగా నడిపిన వెంటనే చార్జ్ పెట్టడం వల్ల కారు బ్యాటరీ అధిక ఉష్ణోగ్రత బారిన పడుతుంది.
బ్రేకులు.. ఎలక్ట్రిక్ కార్లు సాధారణంగా రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కలిగి ఉంటాయి. అంటే బ్రేకులు వినియోగించిన ప్రతిసారి బ్యాటరీ తిరిగి చార్జ్ అయ్యే సాంకేతికత ఇది. ఇది కారు బ్యాటరీ సింగిల్ చార్జ్ పై అధిక దూరం ప్రయాణించేందుకు సాయపడుతుంది. అందుకే ఈ బ్రేకింగ్ సిస్టమ్ ను సమయానుకూల మెయింటెనెన్స్ అవసరం.
టైర్లు.. ఎలక్ట్రిక్ కార్లు యజమానులు దృష్టి సారించాల్సిన మరో అంశం కారు టైర్ల నిర్వహణ. సిఫార్సు చేయబడిన టైర్ ప్రెజర్ ను మెయింటేన్ చేయాలి. ఇప్పటికప్పుడు టైర్లలో గాలిని తనిఖీ చేసుకోవాలి. గాలి కావాల్సిన దానికన్నా తక్కువ ఉన్నా లేదా ఎక్కువ ఉన్నా ప్రమాదమే. తక్కువ గాలి ఉన్న టైర్ల కారణంగా ఎలక్ట్రిక్ కార్ల లైఫ్ తగ్గిపోతుంది. దాని రేంజ్ కూడా పడిపోతుంది. అలాగే అధికంగా గాలి పెడితే అవి పేలిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే టైర్ల లైఫ్ కూడా తగ్గిపోతుంది. వాస్తవానికి ఎలక్ట్రిక్ కార్లు సంప్రదాయ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ కార్లకంటే బరువుగా ఉంటాయి. దీని ఫలితంగా టైర్లు వేగంగా అరిగిపోతాయి. మెరుగైన పనితీరు, భద్రతను నిర్ధారించడానికి టైర్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం ముఖ్యం.
ఎలక్ట్రిక్ కారును కలిగి ఉండటం అంటే దీర్ఘకాలిక పొదుపు ప్రణాళికను కలిగి ఉండటమే. దీని కోసం మనం వెచ్చిస్తున్న మొత్తాన్ని సంప్రదాయ ఇంజిన్ వాహనాలతో పోల్చి చూస్తే మనం ఎంత మొత్తం ఆదా చేస్తున్నామో అర్థం అవుతుంది. ఎలక్ట్రిక్ కార్లు తక్కువ కదిలే భాగాలను కలిగి ఉంటాయి. ఒక మోటార్, టైర్లు స్టీరింగ్ వంటివి ప్రధాన భాగాలు తప్ప ఇంకేమి తిరిగే సామానులు ఉండవు. ఫలితంగా నిర్వహణ తగ్గుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..