FDs interest rate: ఫిక్స్ డ్ డిపాజిట్లకు బెస్ట్ బ్యాంకులు ఇవే.. ఖాతాదారులకు ఎంత వడ్డీ ఇస్తున్నాయంటే..?

ప్రజలకు ఎంతో నమ్మకమైన పెట్టుబడి పథకాల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లదే (ఎఫ్ డీలు) అగ్రస్థానం. వివిధ బ్యాంకులు అందించే ఈ పథకాల్లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. చాలామంది తమ పిల్లల చదువులు, వివాహం, ఇతర అవసరాలకు వీటిలో పెట్టుబడి పెడతారు. మార్కెట్ ఒడిదొడుకులతో సంబంధం లేకుండా నిర్ణీత కాలానికి అసలుతో సహా వడ్డీ పొందే అవకాశం ఉండడం దీనికి కారణం.

FDs interest rate: ఫిక్స్ డ్ డిపాజిట్లకు బెస్ట్ బ్యాంకులు ఇవే.. ఖాతాదారులకు ఎంత వడ్డీ ఇస్తున్నాయంటే..?
Fixed Deposit

Updated on: Feb 23, 2025 | 5:56 PM

ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఎఫ్ డీ పథకాలపై ఆధారపడతారు. ఇటీవల రిజర్వ్ బ్యాంకు రెపోరేటును తగ్గించిన నేపథ్యంలో ఎఫ్ డీలపై ఇచ్చే రేట్లు కూడా తగ్గుముఖం పట్టనున్నాయి. అయితే కొన్ని బ్యాంకులు మాత్రం సీనియర్ సిటిజన్లకు 9.10 శాతం వడ్డీ రేటును కొనసాగిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎఫ్ డీ వడ్డీరేట్లను సవరించిన బ్యాంకులు వివరాలు ఇవీ.

సిటీ యూనియన్ బ్యాంకు

ఈ బ్యాంకులో మూడు కోట్ల రూపాయల లోపు ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీరేటును సవరించారు. దాని ప్రకారం.. ఏడు రోజుల నుంచి పదేళ్ల కాలానికి 5 శాతం నుంచి 7.50 శాతం వడ్డీ అందిస్తున్నారు. సీనియర్ సిటిజన్లకు ఏడాదికి 5 శాతం నుంచి 8 శాతం మధ్య అమలు చేస్తున్నారు. 333 రోజుల కాలానికి సాధారణ ఖాతాదారులు 7.50 శాతం, సీనియర్ సిటిజన్లు 8 శాతం వడ్డీని పొందవచ్చు.

డీసీబీ బ్యాంకు

ప్రైవేటు బ్యాంకు అయిణ డీసీబీ మూడు కోట్ల రూపాయల కంటే తక్కువ ఎఫ్ డీలకు వడ్డీరేట్లు తగ్గించింది. ఎంపిక చేసిన కాల పరిమితులకు మాత్రమే తగ్గింపును వర్తింపజేసింది. సవరించిన రేట్ల తర్వాత ఏడాదికి 3.75 శాతం నుంచి 8.05 శాతం వడ్డీని అమలు చేస్తోంది. అత్యధిక వడ్డీ రేటు 8.05 శాతాన్ని సాధారణ ఖాాతాదారులకు 19 నెలల నుంచి 20 నెలల కాలవ్యవధిలో అందజేస్తుంది. అదే సమయంలో సీనియర్ సిటిజన్లు 8.55 శాతం పొందవచ్చు. ఫిబ్రవరి 14 నుంచి వీటిని అమలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కర్ణాటక బ్యాంక్

కర్ణాటక బ్యాంకులో మూడు కోట్ల రూపాయల కంటే తక్కువ డిపాజిట్లకు వడ్డీరేట్లను సవరించారు. ప్రస్తుతం సాధారణ ఖాతాదారులకు 7 రోజుల నుంచి పదేళ్ల డిపాజిట్లపై 3.50 శాతం నుంచి 7.50 శాతం వడ్డీని అందిస్తున్నారు. ఇదే సమయంలో సినియర్ సిటిజన్లకు 3.75 శాతం నుంచి 8 శాతం వర్తింపజేస్తున్నారు. ఈ బ్యాంకులో 401 రోజుల కాలవ్యవధి డిపాజిట్లకు ఈ రేటును ఇస్తున్నారు. కొత్త రేట్లు ఫిబ్రవరి 18 నుంచి అమల్లోకి వచ్చాయి.

శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీరేటును ఈ బ్యాంకు తగ్గించింది. ఆ ప్రకారం సాధారణ పౌరులకు ఏడాదికి 3.50 శాతం 8.55 శాతం వరకూ, సీనియర్ సిటిజన్లకు 4 శాతం నుంచి 9.05 శాతం వరకూ వడ్డీని అందజేస్తోంది. 12 నెలల ఒక్క రోజు నుంచి 18 నెలల కంటే తక్కువ కాలవ్యవధి డిపాజిట్లపై సాధారణ ప్రజలు 8.50 శాతం అత్యధిక వడ్డీ పొందవచ్చు. అదే సమయంలో సీనియర్ సిటిజన్లకు 9.05 శాతం వడ్డీని అందిస్తున్నారు. సవరించిన వడ్డీరేట్లు ఫిబ్రవరి 18 నుంచి అమలు చేస్తున్నారు.

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

ఫిక్స్ డ్ డిపాజిట్లతో పాటు సేవింగ్స్ ఖాతా వడ్డీరేట్లను ఈ బ్యాంకు సవరించింది. సాధారణ పౌరులకు ఏడాదికి 3.75 శాతం నుంచి 8.25 శాతం వరకూ, సీనియర్ సిటిజన్లకు 4.25 శాతం నుంచి 8.75 శాతం వడ్డీని అందిస్తోంది. 18 నెలల కాలానికి సాధారణ ఖాతాదారులు (8.25 శాతం), సీనియర్ సిటిజన్లు (8.75 శాతం) అత్యధిక వడ్డీని పొందవచ్చు. పొదుపు ఖాతాలకు 3.25 శాతం నుంచి 7.50 శాతం వడ్డీని ఇస్తుంది. మూడు కోట్ల రూపాయల లోపు ఫిక్స్ డ్ డిపాజిట్లపై వీటిని అమలు చేస్తోంది. ఫిబ్రవరి 21 నుంచి కొత్త వడ్డీరేట్లను తీసుకువచ్చింది.

సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

బ్యాంకులో రూ.మూడుకోట్ల లోపు ఎఫ్ డీలపై వడ్డీరేటును తగ్గించింది. ఫిబ్రవరి ఒకటి నుంచే కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. దాని ప్రకారం.. సాధారణ పౌరులకు 4 శాతం నుంచి 8.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.50 శాతం నుంచి 9.10 శాతం వడ్డీని అందిస్తోంది. ఐదేళ్ల కాల పరిమితి గల డిాపాజిట్లకు అత్యధిక వడ్డీరేటును పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి