
ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక స్థిరత్వం కొరుకునే సీనియర్ సిటిజన్లకు కేంద్రం ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్ సీఎస్ఎస్) అనే పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ఉపయోగాలు, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇది ప్రభుత్వ మద్దతు కలిగిన ఫిక్స్ డ్ డిపాజిట్ పథకం. సీనియర్ సిటిజన్లకు హామీ ఇచ్చిన రాబడిని అందిస్తుంది. ఈ పథకంలో చేరడానికి 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్నవారు అర్హులు. సూపర్ యాన్యుయేషన్, వీఆర్ఎస్, స్పెషల్ వీఆర్ఎస్ కింద పదవీ విరమణ చేస్తే 55 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు చేరవచ్చు. రిటైర్డ్ డిఫెన్స్ సర్వీసెస్ సిబ్బందికి 50 ఏళ్ల నుంచే అవకాశం కల్పించారు.
వ్యక్తిగతంగా లేదా జీవిత భాగస్వామితో కలిసి ఎస్సీఎస్ఎస్ ఖాతాను తీసుకోవచ్చు. కనీసం రూ.1000, గరిష్టంగా రూ.30 లక్షల వరకూ డిపాజిట్ చేయవచ్చు. ఖాతా కాల పరిమితి ఐదేళ్లు ఉంటుంది. అవసరమైతే మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ఏటా ఏప్రిల్, జూలై, అక్టోబర్, జనవరి నెలల మొదటి పనిదినంలో వడ్డీని చెల్లిస్తారు. ఆ సమయంలో క్లెయిమ్ చేసుకోకపోతే వడ్డీ పెరగదు. కొన్ని సమయాల్లో నిబంధనలకు లోబడి ఏడాది తర్వాత ఖాతాను మూసివేయవచ్చు. ఈ పథకం వల్ల వడ్డీతో పాటు కొన్ని ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. సీనియర్ సిటిజన్ (తల్లి) కు పన్ను మినహాయింపులు అందజేస్తారు. దీనిలో పెట్టుబడికి సెక్షన్ 80 సీ కింద ఏడాదికి రూ.1.50 లక్షల వరకూ మినహాయింపు ఇస్తారు. అయితే వడ్డీ రూపంలో వచ్చే ఆదాయానికి పన్ను కట్టాలి. దీనిలోనూ రూ.50 వేల వరకూ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కాగా.. ఈ పథకంలో పెట్టుబడి కోసం కుమారుడు లేదా కుమార్తె తమ సీనియర్ సిటిజన్ తల్లికి ఇచ్చే బహుమతి ఏదైనా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56 ప్రకారం పన్ను రహితంగా ఉంటుంది.
ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో చాలా సులభంగా ఎస్సీఎస్ఎస్ ఖాతాలను తెరవొచ్చు. ముందుగా సమీపంలోని బ్రాంచ్ కు వెళ్లి, దరఖాస్తు ఫారంలో వివరాలు నింపాలి. మీ పాన్ కార్డు, పాస్ పోర్టు సైజు ఫొటో, చిరునామా రుజువులు అందజేయాలి. ఖాతాలో రూ.లక్ష కంటే తక్కువ డిపాజిట్ చేస్తే నగదు అందజేయవచ్చు. ఆ పరిమితి దాటితే చెక్కు ద్వారా సొమ్ము అందజేయాలి. ఖాతా తెరిచిన తర్వాత మీకు పాస్ పుస్తకం అందజేస్తారు.
ఉదాహరణకు ఈ పథకంలో గరిష్టంగా రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టారనుకుందాం. ప్రస్తుతం ఇస్తున్న 8.20 వడ్డీరేటు ప్రకారం ప్రతి మూడు నెలలకు మీ చేతికి రూ.61,500 వస్తాయి. అంటే నెలకు రూ.20,500 అన్నమాట. ఉద్యోగ విరమణ చేసిన వారు ప్రతి నెలా జీతం మాదిరిగా ఈ వడ్డీని అందుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..