
బ్యాంకులు, ఇతర నాన్ ఫైనాన్షియల్ సంస్థలలో లావాదేవీలు నిర్వహించేటప్పుడు ఖాతాదారులు తమ కేవైసీ పత్రాలను సమర్పించాలి. అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు తదితర వాటిని అందజేయాలి. వాటిని పరిశీలించిన అనంతరం మన పనిని అధికారులు ప్రారంభిస్తారు. లావాదేవీలు నిర్వహించే ప్రతిసారీ ఇలా చేయడం ఇబ్బందిగా ఉంటుంది. పని కూడా ఆలస్యమవుతుంది. దీనిని నివారించడంతో పాటు ఖాతాదారులకు వేగవంతంగా సేవలు అందేలా చేయడం కోసం ప్రభుత్వం సీకేవైసీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఖాతాదారుల కేవైసీ రికార్డులను భద్రపరిచే విధానాన్నే సీకేవైసీ అంటారు. అంటే సెంట్రల్ నో యువర్ కస్టమర్ అని అర్థం.
సీకేవైసీతో ఖాతాదారులకు వేగవంతంగా సేవలు అందుతాయి. ఆర్థిక సంస్థలకు కూడా వెరిఫై చేసే పని ఉండదు. దీని ద్వారా మీ కేవైసీని ప్రాసెస్ చేసి, ప్రత్యేక 14 అంకెల సంఖ్యను కేటాయిస్తారు. ఆ నంబర్ చెబితే మీ లావాదేవీ వేగవంతంగా పూర్తవుతుంది. ఉదాహరణకు కొత్త ఖాతా తెరవాలనుకున్నప్పుడు మీరు సీకేవైసీ నంబర్ చెబితే ప్రక్రియ చాలా సులువుగా పూర్తవుతుంది.
సీకేవైసీ అనేది వ్యక్తుల కేవైసీ సమాచారాన్ని నిల్వ చేసే కేంద్ర రిపోజిటరీగా పనిచేస్తుంది. బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్‌లు, బీమా కంపెనీలు మొదలైన వివిధ ఆర్థిక సంస్థలతో లావాదేవీలను నిర్వహించేటప్పుడు పదేపదే పత్రాలను సమర్పించాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..