
ప్రతి ఒక్కరికీ జీవితంలో ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. సంపాదించిన డబ్బును జాగ్రత్తగా ఖర్చుచేయడం, పొదుపు గా ఉండడంతో పాటు దాచిన డబ్బును ఎలా పెట్టుబడిగా పెట్టాలి అనే విషయాలపై అవగాహన పెంచుకోవాలి. సాధారణంగా డబ్బును బ్యాంకులలో పొదుపు చేస్తాం. అక్కడ ఉన్న వివిధ పథకాల్లో పెట్టుబడి పెడతాం. వాటిపై వడ్డీరేటు ఎప్పుడు స్థిరంగా ఉండదు. ఒక్కోసారి తగ్గవచ్చు. ఈ నేపథ్యంలో వడ్డీరేట్లు తగ్గినప్పుడు కూడా మనకు నష్టం కలగకుండా ఉండే పెట్టుబడి మార్గాలను ఎంచుకోవడం ముఖ్యం. అలాంటి పథకాలు కూడా ఉంటాయా? ఉన్నాయంటున్నారు ఆర్థిక నిపుణులు. అవేంటో ఓ సారి చూద్దాం..
రిజర్వ్ బ్యాంకు ఆదేశాలకు అనుగుణంగా దేశంలోని బ్యాంకులన్నీ నడుచుకుంటాయి. డిపాజిట్లు, వివిధ పథకాలపై వడ్డీరేట్లను ఆర్ బీఐ నిర్ణయిస్తుంది. వడ్డీరేట్ల పెంపు, తగ్గింపు అంతా దానిపైనే ఆధారపడుతుంది. ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఆర్ బీఐ తీసుకున్న నిర్ణయాలను అన్ని బ్యాంకులు అమలు చేస్తాయి. ఫిబ్రవరిలో జరిగిన మానిటరీ పాలసీ మీటింగ్ లో రిజర్వ్ బ్యాంకు ఆరోసారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. అయితే ఈ ఏడాది చివరిలో వడ్డీరేట్లు తగ్గవచ్చుననే అంచనాలు ఉన్నాయి. ఒకవేళ రిజర్వ్ బ్యాంకు వడ్డీరేట్లను తగ్గిస్తే పెట్టుబడి దారులు ఏమి చేయాలి? ఆదాయాన్ని ఇచ్చే ఇతర పెట్టుబడి మార్గాలు ఉన్నాయా? అంటే ఉన్నాయి. అవేంటంటే.. దీర్ఘకాలిక బాండ్లు, ఏడాదిన్నర నుంచి రెండేళ్ల కాల వ్యవధి కలిగిన గిల్ట్ బాండ్లు, దీర్ఘకాలిక డిపాజిట్లు, 65 శాతం కంటే తక్కువ ఈక్విటీ కేటాయింపుతో కూడిన బ్యాలెన్స్‌డ్ మ్యూచువల్ ఫండ్‌లు ఉపయోగంగా ఉంటాయి. వడ్డీరేట్ల తగ్గింపు సమయంలో వీటిలో పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనం కలుగుతుంది.
వడ్డీరేట్లు తగ్గిపోతున్న సమయంలో లాంగ్ టర్మ్ బాండ్లలో పెట్టుబడి పెట్టడం మంచిది. ఇది సరైన పెట్టుబడి మార్గం కూడా చెప్పవచ్చు. నేరుగా దీర్ఘకాలిక గవర్నమెంట్ బాండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. లేకపోతే ప్రభుత్వ సెక్యూరిటీలలోని లాంగ్ డ్యూరేషన్ డెట్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయాలి. వడ్డీరేట్లు తక్కువగా ఉన్న సమయంలో ఈ విధానం చాలా మంచింది.
దీర్ఘకాలిక ఫిక్స్‌డ్ డిపాజిట్లలో (ఎఫ్ డీలు) డబ్బును పెట్టుబడి పెట్టడం మరో ఉత్తమ విధానం. వడ్డీ రేట్లు కొంతకాలంగా స్థిరంగా ఉంటాయి కాబట్టి, ఎఫ్ డీల వడ్డీ రేట్లు కూడా బాగుంటాయి. దీర్ఘకాలిక ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాల్లో డబ్బును ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎలాంటి నష్టాలు ఉండవు.
మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం కూడా మరో సరైన మార్గం. వీటిలో గిల్ట్ ఫండ్‌లు ఎంపిక చేసుకోవడం ఎంతో మేలు. వడ్డీ రేటు తగ్గింపులు జరిగినప్పుడు మనకు రెండు అవకాశాలు ఉంటాయి. అవే లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్, ఏడాదిన్నర నుంచి రెండేళ్ల కాల వ్యవధి గల గిల్ట్ ఫండ్స్. వీటిలో గిల్ట్ ఫండ్స్‌కు కేటాయింపు మొత్తం పోర్ట్ ఫోలియోలో 10 శాతానికి మించకూడదు.
35 నుంచి 65 శాతం మధ్య కేటాయింపుతో బ్యాలెన్స్‌డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు ప్రయోజనం లభిస్తుంది. వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉన్నప్పుడు ఇవి ఎంతో ఉత్తమమైనవి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..