
ఫోన్ ను ఎవరైనా దొంగిలిస్తే.. వెంటనే కంగారు పడిపోతారు చాలామంది. పోలిస్ స్టేషన్ లో కంప్లెయింట్ ఇచ్చేందుకు కొంతమంది దగ్గర ఐఎమ్ ఈఐ నెంబర్ కూడా ఉండదు. మరి అలాంటప్పుడు పోయిన ఫోన్ ఎలా తిరిగి వస్తుంది? అందుకే మొబైల్ లో ముందుగానే కొన్ని సేఫ్టీ సెట్టింగ్స్ ఆన్ లో పెట్టుకోవాలి. కొన్ని యాప్స్ ద్వారా మీ ఫోన్ దొంగిలించిన వారి ఫొటో కూడా మీరు పొందొచ్చు. అదెలా అనుకుంటున్నారా ఇది చూసేయండి.
మీ ఫోన్ ఎప్పుడైనా దొంగిలించబడితే, ఫోన్ దానంతట అదే దొంగ ఫోటో తీసి మీకు పంపితే ఎలా ఉంటుంది. ఇలాంటి సేఫ్టీ ఫీచర్‌ను అందించే యాప్స్ కూడా ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా ఆయా యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకుని మీ మొబైల్ లో కొన్ని సెట్టింగ్స్ మార్చడమే. ఫోన్ దొంగిలించిన దొంగలు వెంటనే సిమ్ కార్డును తీసివేస్తారు లేదా ఫోన్‌ను ఫార్మాట్ చేస్తారు. కాబట్టి సాధారణ ట్రాకింగ్ పద్ధతుల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అయితే మీ ఫోన్ లో ఉండే సెల్ఫీ కెమెరా దొంగను ఫొటో తీసి మీకు పంపిస్తే.. అప్పుడు మొబైల్ ఎక్కడ ఉన్నా ఎన్ని రోజులు అయినా పెద్దగా సమస్య ఉండదు. ఎందుకంటే దొంగను పట్టుకోగానే అన్ని తిరిగి వస్తాయి. అందుకే మొబైల్ లో ఈ తరహా సెట్టింగ్ ఎప్పుడూ ఆన్ లో ఉంచుకోవడం బెటర్.
ఫోన్ దొంగిలించబడిన తర్వాత దొంగ ఫోటో మీకు రావాలనుకుంటే.. ముందుగా మీరు మొబైల్ లో బిట్ డిఫెండర్(Bitdefender), ప్రే (Prey) లేదా సెర్బరస్ (Cerberus) వంటి యాప్స్ ఇన్‌స్టాల్ చేయాలి. వీటిలో ఏదో ఒక యాప్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత, దానికి అవసరమైన అన్ని పర్మిషన్స్ ఇచ్చి ఇన్‌స్టాల్ పూర్తి చేయాలి. ఇప్పుడు ఆయా యాప్స్ లో సెట్టింగ్స్ ఆన్ చేయడం ద్వారా యాంటీ థెఫ్ట్ సెల్ఫీ ఫీచర్ ను ఎనేబుల్ చేసుకోవచ్చు.
యాప్స్‌లో ఒకదానిని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత యాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ‘యాంటీ థెఫ్ట్’ సెట్టింగ్స్‌లో ‘థీఫ్ సెల్ఫీ’ అనే ఫీచర్‌ను ఎనేబుల్ చేయాలి. ఇలా చేస్తే.. ఎవరైనా మీ ఫోన్ దొంగిలించినప్పుడు తప్పు పాస్‌వర్డ్ ఎంటర్ చేసినా లేదా సిమ్ మార్చినా ఫోన్ లోని సెల్ఫీ కెమెరా ఫొటో తీసి మీకు ఇమెయిల్ లో పంపిస్తుంది. మీరు మరొక ఫోన్‌లో ఇ–మెయిల్ ఓపెన్ చేసి ఆయా వివరాలు తెలుసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ కోసం గుర్తు తెలియని ఫేక్ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేయొద్దు. ప్లేస్టోర్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..