Rupee Value Down: పతనం కొనసాగుతోంది.. రూపాయి బావురుమంటోంది.. రోజురోజుకూ దిగజారుతున్న విలువ కలవరపాటుకు గురిచేస్తోంది. తాజాగా రూపాయి విలువ అమాంతం పడిపోయింది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రోజు రోజుకూ పతనం దిశగా సాగుతోంది. లేటెస్ట్‌గా రూపాయి ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరింది. డాలరుతో రూపాయి విలువ 79.04కి పతనమైంది.
మంగళవారం నాడు 48 పైసలు క్షీణించిన రూపాయి.. 78.85 వద్ద ముగిసింది. తాజాగా మరో 19 పైసలు క్షీణించింది. ఫారెన్ ఇన్వెస్టర్స్ అమ్మకాలు కొనసాగుతుండడం, ఇంధన ధరల పెరగుదుల, ద్రవ్యోల్బణం వంటివి రూపాయి క్షీణతకు కారణమని నిపుణులు చెబుతున్నారు. రూపాయి బలపడడానికి రిజర్వ్ బ్యాంక్ ఇటీవల పలు చర్యలు చేపట్టినప్పటికీ.. ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.
రూపాయి విలువ పడిపోతుండడం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రూపాయి విలువ పతనంతో మధ్యతరగతి ప్రజల బతుకు మరింత భారంగా మారనుంది. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. విదేశాల నుంచి దిగుమతయ్యే వంటనూనె, పప్పుదినుసులకూ అధిక ధరలు చెల్లించాలి. డాలర్లలో చెల్లింపులు గుదిబండగా మారనున్నాయి. ముడి సరకుల్లో అత్యధిక భాగం దిగుమతి చేసుకునే పరిశ్రమలు కరెన్సీ పతనంతో దెబ్బతింటాయి. ఇతర దేశాలకు విహారయాత్రలకు వెళ్లాలంటే అధికంగా ఖర్చవుతుంది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులపై భారం పెరుగుతుంది. అయితే.. భారత ఐటీ, ఫార్మా రంగాలకు ఈ పరిస్థితి వల్ల ప్రయోజనం చేకూరుతుంది. ఒక డాలరుకు ఎక్కువ రూపాయలు అందుతాయి కాబట్టి రూపాయి క్షీణత వల్ల ప్రవాస భారతీయ కుటుంబాలు లాభపడతాయి.