PM Vishwakarma: ఆ కేంద్ర ప్రభుత్వ పథకం సూపర్ సక్సెస్.. ప్రజలకు రూ.1750 కోట్ల రుణాలు

|

Dec 11, 2024 | 3:30 PM

ఇటీవల కాలంలో యువత ఆలోచనా విధానం బాగా మారింది. ముఖ్యంగా ఒకరి కింద పని చేయకుండా సొంతంగా వ్యాపారం చేసి తమ కాళ్లపై తాము నిలబడాలని కోరుకునే వారి సంఖ్య భారీగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో యువ వ్యాపారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం విశ్వకర్మ పేరుతో రుణాలను అందిస్తుంది. బ్యాంకులు కూడా ఈ రుణాలన విరివిగా వ్యాపారులకు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీఎం విశ్వకర్మ పథకం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

PM Vishwakarma: ఆ కేంద్ర ప్రభుత్వ పథకం సూపర్ సక్సెస్.. ప్రజలకు రూ.1750 కోట్ల రుణాలు
Pm Vishwakarma
Follow us on

ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద అక్టోబర్ 31 నాటికి బ్యాంకులు రూ.1,751 కోట్ల రుణాలను మంజూరు చేశాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇటీవల పార్లమెంట్‌లో తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు రాతపూర్వక సమాధానంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రుణగ్రహీతలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి, జనాభా అవసరాలను తీర్చడానికి సులభంగా రుణాలను అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. బ్యాంకులు అక్టోబర్ 31 నాటికి రూ. 1,751.20 కోట్ల రుణం మొత్తంతో పీఎం విశ్వకర్మ పథకం కింద 2.02 లక్షల ఖాతాలు తెరిచారని స్పష్టం చేశారు. 

ముఖ్యంగా చేతి పని చేసుకునే వ్యాపారులకు ఎండ్-టు-ఎండ్ మద్దతును అందించడానికి ప్రభుత్వం సెప్టెంబర్ 17, 2023న పీఎం విశ్వకర్మను ప్రారంభించింది. ముఖ్యంగా బంగారం పని, వడ్రంగి పనులను చేసేవారిని గ్రామల్లో ‘విశ్వకర్మలు’ అని పిలుస్తారు. కమ్మరి, స్వర్ణకారుడు, కుమ్మరి, వడ్రంగి, శిల్పుల కోసం ఈ రుణాలు అందుబాటులో ఉన్నాయి. 2023-2024 ఆర్థిక సంవత్సరం నుంచి 2027-28 ఆర్థిక సంవత్సరం వరకు రూ. 3027 కోట్లను రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

ఇవి కూడా చదవండి

పీఎం విశ్వకర్మ దరఖాస్తు ఇలా

  • ముందుగా పీఎం విశ్వకర్మ అధికారిక వెబ్ సైట్‌కు వెళ్లాలి.
  • అక్కడ రిజిస్ట్రేషన్ ఆప్షన్‌ను ఎంచుకుని, మొబైల్ ధ్రువీకరణ, ఆధార్ ఈ-కేవైసీను పూర్తి చేయాలి. 
  • ఆర్టిజన్ రిజిస్ట్రేషన్ ఫారమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
  • అనంతరం విశ్వకర్మ డిజిటల్ ఐడీ, సర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత బ్యాంకులను సందర్శించి రుణం పొందవచ్చు. 

అర్హతలు ఇవే

  • అసంఘటిత రంగంలోని కళాకారులు లేదా కార్మికులు, టూల్స్ ఉపయోగించి పని చేసే వారు ఈ పథకానికి అర్హులు
  • దరఖాస్తు చేయడానికి 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి.
  • దరఖాస్తుదారులు రిజిస్ట్రేషన్ సమయంలో వారి వ్యాపారం కచ్చితంగా చేస్తూ ఉండాలి. అలాగే గత ఐదేళ్లల్లో కేంద్ర ప్రభుత్వ పథకం నుంచి ఎలాంటి రుణాలను పొందకూడదు. 
  • భర్త, భార్య, వారి అవివాహిత పిల్లలతో సహా ఒక కుటుంబ సభ్యుడు మాత్రమే పథకం నుంచి ప్రయోజనం పొందాల్సి ఉంటుంది. 
  • ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలు ప్రయోజనాలు పొందేందుకు అర్హత ఉండదు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి