ఇటీవల కాలంలో పర్యావరణ హితమైన వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఒకవైపు ఎలక్ట్రిక్, మరోవైపు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ) వెర్షన్ కార్లు విరివిగా మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా నుంచి కొత్త సీఎన్జీ కారు లాంచ్ అయ్యింది. టాటా నెక్సాన్ ఐసీఎన్జీ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది ఇప్పటికే ఉన్న నెక్సాన్ సీఎన్జీ ఎస్‌యూవీ కన్నా శక్తివంతమైనదని కంపెనీ పేర్కొంది. ఈ నెక్సాన్ ఐసీఎన్జీ ధర రూ. 9లక్షల నుంచి రూ. 14.5లక్షలు(ఎక్స్ షోరూం) వరకూ ఉంటుంది. ఈ నెక్సాన్ కారు ఇప్పటికే పెట్రోల్, డీజిల్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో ఈ కారే టాప్ లో ఉంది.
టాటా నుంచి ఇప్పటికే టియాగో, టైగోర్, పంచ్, ఆల్టోజ్ వంటి మోడళ్లు ఇప్పటికే సీఎన్జీ వేరియంట్లో అందుబాటులో ఉన్నాయి. వాటి సరసన ఇప్పుడు టాటా నెక్సాన్ కూడా చేరింది. టాటా మోటార్స్ నుంచి అమ్ముడవుతున్న మొత్తం కార్లలో 21శాతం వరకూ ఎలక్ట్రిక్ వేరియంట్ వే ఉన్నాయని టాటా ఇటీవల ప్రకటించింది. మన దేశంలో ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు ఉన్న డిమాండ్ ను ఇది తెలియజేస్తుందని టాటా పేర్కొంది. ఈ క్రమంలో నెక్సాన్ ఐసీఎన్జీ కారును అధిక శక్తితో అత్యాధునిక ఫీచర్లను జోడించి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. ఇది వినియోగదారులను తప్పనిసరిగా ఆకట్టుకుంటుందని పేర్కొంది.
టాటా నుంచి ఇతర మోడళ్ల మాదిరిగానే నెక్సాన్ ఐసీఎన్జీ ట్విన్-సిలిండర్ సెటప్ నుంచి ప్రయోజనాలను పొందుతుంది. ఇది రెండు స్లిమ్ సిలిండర్లను కలిగి ఉంటుంది. సంప్రదాయ సెటప్ ల మాదిరిగానే దీనిలో ఎక్కువ కార్గో స్పేస్ ఎక్కువగానే ఉంటుంది. ఈ ఇంజిన్ 98 బీహెచ్పీ పవర్, 170 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సీఎన్జీతో నడిచే వాహనాలలో అత్యంత శక్తి కలిగిన వాటిలో ఒకటిగా నిలుస్తుంది. ఇంజన్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో జత చేసి ఉంటుంది. అదే సమయంలో ఏఎంటీ ఆప్షన్ కూడా ఉంటుంది.
టాటా నెక్సాన్ ఐసీఎన్జీ ఎనిమిది విస్తృత వేరియంట్లను కలిగి ఉంటుంది. టాటా నెక్సాన్ సీఎన్జీ స్మార్ట్(O), స్మార్ట్+, స్మార్ట్+ఎస్, ప్యూర్, ప్యూర్ ఎస్, క్రియేటివ్, క్రియేటివ్+, ఫియర్స్ + పీఎస్ లలో అందుబాటులో ఉంది.
టాటా నెక్సాన్ ఐసీఎన్జీ ధర రూ. 9 లక్షల నుంచి రూ. 14.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకూ ఉంటుంది. బేస్ నెక్సాన్ స్మార్ట్(O) రూ. 9 లక్షలు, దాని తర్వాత స్మార్ట్+ రూ. 9.69 లక్షలు, స్మార్ట్+ఎస్ 10 లక్షలు ఉంటుంది. అలాగే టాటా నెక్సాన్ ఐసీఎన్జీ ప్యూర్ ధర రూ. 10.69లక్షలు, ప్యూర్ ఎస్ రూ. 11 లక్షలు ఉంటుంది. దీని తర్వాత క్రియేటివ్ వేరియంట్ రూ. 11.69 లక్షలు, క్రియేటివ్+ రూ. 12.19 లక్షలు, టాప్-ఆఫ్-లైన్ ఫియర్స్+ పీఎస్ రూ. 14.50 లక్షలుగా ఉంటుంది.
టాటా నెక్సాన్ ఐసీఎన్జీ వినియోగదారులకు అధిక సౌలభ్యం, సౌకర్యాన్ని అందించే ఫీచర్లను కలిగి ఉంటుంది. డ్యాష్ బోర్డ్లో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ ప్లే, 10.25-అంగుళాల ఆల్- డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, 360-డిగ్రీ కెమెరా, లెథెరెట్ సీట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వాయిస్-ఎనేబుల్డ్ పనోరమిక్ సన్రూఫ్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇక భద్రత విషయానికి వస్తే అన్ని వేరియంట్లలోనూ ఆరు ఎయిర్ బ్యాగ్ లు ప్రామాణికంగా వస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..