అరచేతిలో ప్రపంచం.. ఇంట్లో కూర్చునే అన్నింటిని ఆపరేట్ చేయొచ్చు.. వంట చేయకుండానే నచ్చిన రెస్టారంట్ల నుంచి ఇష్టమైన ఆహారాన్ని తెప్పించుకుని ఆస్వాదించవచ్చు.. ఇలా ప్రస్తుతకాలంలో చాలా మంది బయట దొరికే రుచికరమైన ఫుడ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.. బిజీలైఫ్, పని ఒత్తిడి, సమయం లేకపోవడం వల్ల చాలా మంది వంట చేయకుండా ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జొమాటో లపై ఆధారపడుతున్నాయి.. ఈ యాప్స్ కూడా అదేవిధంగా ప్రజలకు సౌకర్యవంతంగా సేవలు అందిస్తున్నాయి. అందరికీ చేరువ అవుతూ.. ఎండనకా.. వాననకా.. పగలు రాత్రి అనే తేడా లేకుండా రుచికరమైన ఫుడ్ ను ఎప్పటికప్పుడు అందిస్తున్నాయి. అయితే.. ఫుడ్ డెలివరీ ప్రయాణంలో.. స్విగ్గీ సంస్థ పదేళ్లు పూర్తి చేసుకుంది. దశాబ్దం నాటి తీపి గుర్తులను పంచుకుంటూ ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీహర్ష మాజేటి సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ చేశారు. ఈ సందర్భంగా తమ సంస్థ ఫస్ట్ డే ఆర్డర్ల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
2014లో ఆగస్టు 6న తాము స్విగ్గీని ప్రారంభించామని .. ఫుడ్ ఆర్డర్ ఎప్పుడు వస్తుందా… అని ఎదురుచూసినట్లు తెలిపారు. కానీ, మొదటిరోజు తమకు ఒక్క ఆర్డరూ కూడా రాలేదన్నారు. మరుసటి రోజు తొలి ఆర్డర్ అందుకున్నట్లు తెలిపారు. అదే తమ జర్నీలో అసలైన ప్రారంభానికి గుర్తు అని.. తమ తొలి భాగస్వాముల్లో ఒకటైన ట్రఫుల్స్ రెస్టారంట్ నుంచి ఆహారం కోసం తమకు రెండు ఆర్డర్లు వచ్చినట్లు తెలిపారు. అప్పటి నుంచి వారితో తమ భాగస్వామ్యం బలపడిందన్నారు. ఒక దశలో ఒక్క రోజులో 7261 ఆర్డర్లు కూడా అందుకున్నట్లు శ్రీహర్ష వెల్లడించారు.
ఈ సందర్భంగా స్విగ్గీ సంస్థ ఎదుగుదల గురించి కూడా వెల్లడించారు. ఫుడ్ డెలివరీ కాన్సెప్ట్ అప్పుడప్పుడే అందరికీ చేరువవుతోన్న తరుణంలో తమపై విశ్వాసం ఉంచిన రెస్టారంట్లకు శ్రీహర్ష కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం 3లక్షల రెస్టారంట్లతో కలిసి పనిచేస్తున్నామని.. ఇది తమకెంతో గర్వకారణమని తెలిపారు. ఆ మద్దతే ప్రతి ఇంట్లో తమ పేరు వినిపించేందుకు కారణమైందని పేర్కొన్నారు.
కాగా.. కర్ణాటక రాజధాని బెంగళూరు కేంద్రంగా 2014లో స్విగ్గీ ప్రారంభమైంది. శ్రీహర్ష మాజేటి, నందన్ రెడ్డి, రాహుల్ భాగస్వామ్యంలో స్విగ్గీ సంస్థను ప్రారంభించారు. దాదాపు 600 నగరాలకు దీని కార్యకలాపాలు విస్తరించాయి. అంతేకాకుండా నిత్యావసరాలను వేగవంతంగా సరఫరా చేసే సేవల విభాగం ఇన్‌స్టామార్ట్ లో కూడా స్విగ్గీ భాగస్వామ్యంగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..