కేంద్ర ప్రభుత్వ సబ్సిడీతో అందుబాటులోకి ఉల్లిపాయలు..! ధర ఎంతో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..

కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ నగరాల్లో కిలో రూ.24 చొప్పున సబ్సిడీ ఉల్లిపాయలను అమ్మకానికి ప్రారంభించింది. పెరుగుతున్న ఉల్లి ధరలను అదుపు చేయడానికి ఈ చర్య తీసుకున్నట్లు ప్రకటించారు. నాఫెడ్, ఎన్‌సిసిఎఫ్ వంటి సంస్థల ద్వారా 25 టన్నుల ఉల్లిపాయలు విక్రయించనున్నారు.

కేంద్ర ప్రభుత్వ సబ్సిడీతో అందుబాటులోకి ఉల్లిపాయలు..! ధర ఎంతో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..
Onions

Updated on: Sep 04, 2025 | 4:34 PM

ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌లలో నిత్యవసరమైన ఉల్లిపాయలను ప్రజలందరికీ తక్కువ ధరకు అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం కిలోకు రూ.24 చొప్పున సబ్సిడీ ఉల్లిపాయల అమ్మకాలను ప్రారంభించింది. ఈ చొరవ కోసం కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి మొబైల్ వ్యాన్‌లను జెండా ఊపి ప్రారంభించారు. నాఫెడ్, ఎన్‌సిసిఎఫ్, కేంద్రీయ భండార్ వంటి సహకార సంస్థల ద్వారా ప్రభుత్వ బఫర్ స్టాక్ నుండి సుమారు 25 టన్నుల ఉల్లిపాయలను ఈ నగరాల్లో విక్రయిస్తామని ప్రకటించారు.

రిటైల్ ధరలు కిలోకు రూ.30 దాటిన చోట ఉల్లిపాయలను కిలోకు రూ.24 చొప్పున విక్రయిస్తామని జోషి చెప్పారు. సబ్సిడీ అమ్మకం శుక్రవారం నుండి చెన్నై, గౌహతి, కోల్‌కతాకు విస్తరిస్తుంది. డిసెంబర్ వరకు కొనసాగుతుందని తెలిపారు. అధికారిక డేటా ప్రకారం.. గురువారం అఖిల భారత సగటు ఉల్లిపాయల రిటైల్ ధర కిలోకు రూ.28గా ఉంది, కొన్ని నగరాల్లో ధరలు పెరిగాయి.

ప్రభుత్వం ప్రస్తుతం ధరల స్థిరీకరణ నిధి (PSF) పథకం కింద 2024-25లో కిలోకు సగటున రూ.15 చొప్పున సేకరించిన 3 లక్షల టన్నుల ఉల్లిపాయల బఫర్ స్టాక్‌ను కలిగి ఉంది. ఈ స్టాక్ నుండి ఉల్లిపాయలను గ్రేడింగ్‌ చేసి విడుదల చేయడం ధరల స్థిరత్వాన్ని కొనసాగించడానికి, ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వ వ్యూహంలో భాగమని జోషి తెలిపారు.

ద్రవ్యోల్బణ నియంత్రణ

“ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడమే ప్రభుత్వ ప్రాధాన్యత. ధరల స్థిరీకరణ చర్యల ద్వారా వివిధ ప్రత్యక్ష జోక్యాలు ఇటీవలి నెలల్లో ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో గణనీయమైన పాత్ర పోషించాయి” అని జోషి అన్నారు. జూలై నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 1.55 శాతంగా ఉంది, ఇది దాదాపు ఎనిమిది సంవత్సరాలలో అత్యల్ప స్థాయి.

ఉత్పత్తి, ఎగుమతి పరిస్థితి

వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే మాట్లాడుతూ.. గత సంవత్సరాలతో పోలిస్తే ఉల్లిపాయల ధరలు స్థిరంగా ఉన్నాయని, 2024-25 పంట సంవత్సరంలో దేశీయ ఉత్పత్తి 27 శాతం పెరిగి 30.77 మిలియన్ టన్నులుగా అంచనా వేయబడిందని పేర్కొన్నారు. జూలై, ఆగస్టులలో ఒక్కొక్కటి లక్ష టన్నులు ఎగుమతి చేస్తామని, ఎగుమతి పరిమితులు లేవని ఆమె స్పష్టం చేశారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి