
చాలా కాలంగా అందరూ బంగారాన్ని మాత్రమే మెరుగైన పెట్టుబడి అనుకున్నారు. వెండి విలువైనదే అయినా, దానిపై అంత దృష్టి పెట్టలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కొన్ని కారణాల వల్ల వెండికి డిమాండ్ బాగా పెరిగి అది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రపంచంలో మారిన పరిణామాలు, డాలర్ పడిపోవడం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాల కారణంగా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. వెండి కిలో ధర రూ.1,44,179తో అనే ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకింది. బంగారం10 గ్రాముల ధర కూడా రూ.1,15,939 రికార్డును తాకింది. ముఖ్యంగా గత సంవత్సరంలో బంగారం 51శాతం లాభం ఇస్తే వెండి ఏకంగా 57శాతం లాభం ఇచ్చింది.
వెండికి రెండు రకాల డిమాండ్‌లు ఉండడం దాని ప్రత్యేకత. బంగారం ప్రధానంగా పెట్టుబడికే పనికొస్తుంది. కానీ వెండి..పారిశ్రామిక అవసరానికి ఉపయోగపడుతుంది. ఇక్కడే వెండి అసలు బలం దాగి ఉంది. వెండికి ఉన్న మొత్తం డిమాండ్‌లో 60శాతం వరకు పరిశ్రమల నుంచే వస్తుంది. ఎందుకంటే సోలార్ ప్యానెల్స్ తయారీకి వెండి చాలా ముఖ్యం. అదేవిధంగా ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలలో, సెమీకండక్టర్లలో దీని వాడకం ఎక్కువ. ప్రపంచం మొత్తం క్లీన్ ఎనర్జీ, కొత్త టెక్నాలజీ వైపు వెళ్తున్నందున.. వెండి డిమాండ్ తగ్గదు, ఇంకా పెరుగుతుంది.
బంగారం-వెండి నిష్పత్తి అనేది ఒక ఔన్స్ బంగారంతో ఎన్ని ఔన్స్ వెండి కొనవచ్చో తెలుపుతుంది. ఈ నిష్పత్తి ప్రస్తుతం 87 వద్ద ఉంది. చరిత్రలో ఈ నిష్పత్తి సగటున 67 మాత్రమే ఉంది. అంటే గతం కంటే ఇప్పుడు బంగారంతో పోలిస్తే వెండి ధర తక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. ఈ నిష్పత్తి ఇంత పెరిగినప్పుడు.. ఆ తర్వాత వెండి ధరలు వేగంగా పెరుగుతాయని చరిత్ర చెబుతోంది.
గత నాలుగేళ్లుగా ప్రపంచంలో వెండి డిమాండ్ పెరిగింది. కానీ సరఫరా తగ్గింది. అంటే మార్కెట్‌లో అవసరానికి తగ్గ వెండి దొరకడం లేదు. ఈ కొరత కారణంగా కూడా భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
బంగారం లాగే వెండిలో కూడా భౌతికంగా కాకుండా డిజిటల్ రూపంలో పెట్టుబడి పెట్టవచ్చు:
సిల్వర్ ఈటీఎఫ్‌లు: ఇవి నేరుగా వెండిని కొంటాయి. స్టాక్స్ లాగే ట్రేడ్ చేయవచ్చు. డీమ్యాట్ ఖాతా అవసరం.
ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ : ఇవి నేరుగా ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెడతాయి. డీమ్యాట్ ఖాతా అవసరం లేదు.
వెండి వృద్ధికి అవకాశం ఇస్తుంది. అయితే ఆర్థిక అల్లకల్లోలాల సమయంలో బంగారం స్థిరత్వాన్ని ఇస్తుంది. అందుకే నిపుణులు బంగారం, వెండి రెండింటిలోనూ పెట్టుబడి పెట్టాలని సలహా ఇస్తున్నారు. మీ మొత్తం పోర్ట్‌ఫోలియోలో దాదాపు 10-15 శాతం వీటకి కేటాయించడం మంచిది. బంగారం మీ సంపదను కాపాడుతుంది. వెండి టెక్నాలజీ, పారిశ్రామిక వృద్ధి నుండి లాభం అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..