
బంగారం లాగానే వెండి కూడా ధరలు కూడా చాలా వేగంగా మారుతుంటాయి. కొంతమంది పెట్టుబడిదారులు వెండి స్థిరమైన ఆస్తి అని నమ్ముతారు. కానీ, గడిచిన వందేళ్లలో వెండి ధరల ట్రెండ్స్ చూస్తే.. వెండి.. బంగారం కంటే అస్థిరంగా మారడం గమనించొచ్చు.
కొన్ని రిపోర్ట్ ల ప్రకారం వెండి బంగారం కంటే 2-3 రెట్లు ఎక్కువ అస్థిరంగా ఉంటుంది . ఇప్పుడు రూ. 1,67,000 గా ఉన్న కిలో వెండి ధర వందేళ్ల క్రితం అంటే 1925లో సుమారు రూ. 50 – 100 మధ్య ఉండేదని ఒక అంచనా. ఆ తర్వాత 1980లో హయ్యెస్ట్ రేటుకి పెరిగి రూ. 2,715 చేరుకుంది. ఇది అప్పట్లో ఆల్ టైం హయ్యెస్ట్ ధర అని నిపుణులు చెప్తున్నారు. ఆ తర్వాత వచ్చిన అప్ అండ్ డౌన్స్ గమనిస్తే.. 1985కి కిలో వెండి ధర రూ. 3,955 ఉండగా 1990కి రూ. 6,463 కి పెరిగింది. ఆపైన 1992 లో రూ. 8,040 వరకూ పెరిగి మళ్లీ 1995లో రూ.6,335 కి తగ్గింది.
మళ్లీ 1998లో రూ. 8,580 కి పెరిగి 2000లో మళ్లీ రూ. 7,900 కి తగ్గింది. ఆపైన 2004లో రూ11,770 నుంచి 2005 నాటికి రూ.10,675 కి తగ్గింది. ఇక 2008 నాటికి ఏకంగా రెట్టింపు అయ్యి రూ. 23,625కి చేరుకుంది. ఆ తర్వాత 2015లో రూ. 37,825 ఉండగా, 2020 కి డబుల్ అయ్యి రూ. 63, 435 చేరుకుంది. ఆ తర్వాత 2023లో రూ. 78,600 నుంచి ఇప్పుడు 2025లో రూ 1,67,000 చేరుకుంది.
దీన్ని బట్టి చూస్తే బంగారం ధరల్లో మార్పులకు వెండికి తేడా స్పష్టంగా అర్థం అవుతుంది. బంగారం స్థిరంగా పెరుగుతూ పోవడాన్ని మనం గమనించొచ్చు. కానీ, వెండి అలాకాదు నాలుగైదు ఏళ్ల గ్యాప్ లో భారీగా తగ్గడం మళ్లీ రెట్టింపు అవ్వడం వంటి ట్రెండ్స్ కనిపిస్తున్నాయి.
బంగారంతో పోలిస్తే.. వెండి ధరలను అంచనా వేయడం కష్టమని నిపుణులు అంటున్నారు. ఆభరణాలతో పాటు పరిశ్రమల్లో కూడా వెండిన వాడడం దీనికి గల కారణం. వెండిని వాడుతున్న పరిశ్రమలు, ఆయా రంగాల్లో వచ్చే వాణిజ్య పరమైన మార్పులకు అణుగుణంగా వెండి ధర కదులుతూ ఉంటుంది. కాబట్టి స్వల్పకాలిక పెట్టుబడులు పెట్టేవాళ్లు వెండి విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..