
Invest In Gold and Stock Market: బంగారంలో పెట్టుబడి పెట్టాలా..? లేక స్టాక్ మార్కెట్‌లోనా..? అనే డౌట్ చాలామంది పెట్టుబడిదారులను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. అయితే 2025లో ఈ సందేహానికి బంగారం క్లియర్ సమాధానం ఇచ్చింది. ఈ ఏడాది పెట్టుబడిదారులకు అత్యధిక లాభాలు అందించిన ఆస్తిగా బంగారం నిలిచింది. స్టాక్ మార్కెట్‌ను పరిశీలిస్తే.. దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు నిఫ్టీ–50, సెన్సెక్స్ పరిమిత లాభాలకే ఏడాదికి బై బై చెప్తున్నాయి. 2025 జనవరి 1న 23,742 వద్ద ఉన్న నిఫ్టీ–50, డిసెంబర్ 29 నాటికి 25,972కు చేరి దాదాపు 10 శాతం లాభాన్ని ఇచ్చింది. అలాగే సెన్సెక్స్ కూడా 78,507 నుంచి 84,782కు పెరిగి సుమారు 8 శాతం రిటర్న్‌ను మాత్రమే నమోదు చేసింది.
ఇదే సమయంలో హైదరాబాద్ బంగారం ధరలు మాత్రం పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురిచేశాయి. 2025 జనవరి 1న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.78,000గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.71,500గా నమోదైంది. ఏడాది ముగిసే నాటికి 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,710కు, 22 క్యారెట్ల బంగారం రూ.1,29,900కు చేరింది. అంటే ఒక్క ఏడాదిలోనే బంగారం ధరలు 81 శాతానికి పైగా పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్ల కోతల అవకాశాలు, భద్రతా పెట్టుబడిగా బంగారంపై పెరుగుతున్న ఆసక్తి, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు ఈ పెరుగుదలకు కారణాలుగా నిలిచాయి. ఈ పరిస్థితులు 2026లో కూడా కొనసాగుతాయని అంచనాలు వినిపిస్తున్నాయి. ద్రవ్య విధాన సడలింపులు, డాలర్‌పై ఆధారాన్ని తగ్గించే ప్రయత్నాలు, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు బంగారం ధరలను మరింత పైకి నడిపే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Big Alert: మిత్రమా బిగ్ అలర్ట్.. మరికొన్ని గంటలే ఛాన్స్.. లేకుంటే రూ.1000 ఫైన్ చెల్లించాల్సిందే!
వెండికీ కూడా మంచి రోజులు ముందున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచ సరఫరా పరిమితులు, పరిశ్రమల నుంచి పెరుగుతున్న డిమాండ్ కారణంగా వెండి ధరలు ఎంసీఎక్స్‌లో కిలోకు రూ.2,75,000 వరకు, అంతర్జాతీయంగా ఔన్స్‌కు 80–85 డాలర్ల స్థాయికి చేరవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద వెండి వినియోగదారైన చైనా, 2026 జనవరి 1 నుంచి ఎగుమతులపై లైసెన్స్ నిబంధనలు అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం 2027 వరకు కొనసాగనుండటంతో ప్రపంచ సప్లై చెయిన్ పై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
మొత్తంగా చూస్తే, వడ్డీ రేట్ల కోతలు, గ్లోబల్ వాణిజ్య ఒత్తిళ్లు, పరిశ్రమల డిమాండ్ వంటి అంశాల నేపథ్యంలో 2026లో కూడా బంగారం, వెండి ధరలు బలంగా కొనసాగుతాయని నిపుణుల అభిప్రాయం.