
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఇప్పుడు అధికారికంగా బిలియనీర్ క్లబ్‌లోకి ప్రవేశించారు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో రూ. 12,490 కోట్ల ఆస్తితో షారుఖ్ అగ్రస్థానంలో నిలిచారు. హురున్ షారుఖ్‌ను బిలియనీర్‌గా గుర్తించడం ఇదే మొదటిసారి. తన నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నుంచే కాకుండా కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ద్వారా కూడా షారుఖ్ భారీగా ఆస్తిని సంపాదించారు. దాంతో ఈ ఏడాది షారుక్ బిలియనీర్స్ జాబితాలో మొదటి స్థానం సంపాదించాడు.
ఈ జాబితాలో షారుఖ్ తర్వాత జూహి చావ్లా అండ్ ఫ్యామిలీ రూ.7,790 కోట్లతో రెండవ స్థానంలో ఉన్నారు. వీరికి కూడా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీలో వాటా ఉంది. ఇక ఆ తర్వాత హృతిక్ రోషన్ రూ.2,160 కోట్లతో మూడవ స్థానంలో ఉన్నాడు. హృతిక్ కు హెచ్‌ఆర్‌ఎక్స్ (HRX) ఫిట్‌నెస్ బ్రాండ్ ఉంది. దాని ద్వారా ఈ ఆస్తి సమకూరి ఉండవచ్చు. ఇక కరణ్ జోహార్ రూ.1,880 కోట్లతో నాల్గవ స్థానంలో ఉండగా, అమితాబ్ బచ్చన్ అండ్ ఫ్యామిలీ రూ.1,630 కోట్లతో ఐదవ స్థానంలో ఉన్నారు.
ఇక షారుఖ్ ఖాన్ విషయానికొస్తే.. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు చాలా రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఉన్నాయి. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఆయన ఇంటి విలువ రూ. 200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అలాగే ఆయనకు లండన్‌లోని పార్క్ లేన్‌లో ఒక అపార్ట్‌మెంట్, బెవర్లీ హిల్స్‌లోని ఒక విల్లా, అలీబాగ్‌లోని ఒక ఫామ్‌హౌస్, ఢిల్లీ, దుబాయ్‌లలో నివాసాలు, ఇంగ్లండ్‌లో వెకేషన్ రిట్రీట్ వంటి విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి.
షారుక్ దగ్గర లగ్జరీ ఆటోమొబైల్స్ కలక్షన్ కూడా ఉంది. బీఎండబ్ల్యూ, బెంజ్, రోల్స్ రాయిస్.. ఇలా అతని గ్యారేజ్ లో చాలానే లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటిలో బుగట్టి వెయ్రాన్ (రూ. 12 కోట్లు), రోల్స్ రాయిస్ ఫాంటమ్(రూ. 9.5 కోట్లు) అత్యంత ఖరీదైన కార్లు. ఏదేమైనా ఒకప్పుడు జేబులో కేవలం రూ.1,500 తో ముంబైకి వచ్చానని చెప్పిన షారుఖ్ ఈ రోజు బిలియనీర్ క్లబ్ కు ఎదగడం అంటే అది కేవలం అతడి కష్టంతో సాధించిన విజయం అనే చెప్పాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.