UPI Payments: స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నగదు చెల్లింపు విధానంలో పూర్తిగా మార్పులు వచ్చాయి. టీ నుంచి పెద్ద పెద్ద వస్తువుల కొనుగోలు వరకు ఇప్పుడంతా ఆన్‌లైన్ చెల్లింపులే. ప్రస్తుతం ఎక్కడ చూసిన క్యూఆర్ కోడ్‌లు దర్శనమిస్తున్నాయి. దీంతో చిల్లర సమస్య లేకుండా ఎంచక్కా వినియోగదారులు డబ్బులు చెల్లిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగం పెరగడం అందరికీ ఇంటర్‌నెట్ అందుబాటులోకి రావడంతో యూపీఐ ట్రాన్సాక్షన్స్ బాగా పెరిగాయి.
ఈ క్రమంలోనే గడిచిన ఫిబ్రవరి నెలలో ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎస్‌బీఐ రికార్డు సృష్టించింది. యూపీఐ ప్లాట్ ఫామ్‌పై అత్యధిక లావాదేవీల రికార్డును ఎస్‌బీఐ నమోదు చేసింది. ఎస్‌బీఐ 652.92 మిలియన్ల రెమిటెన్స్ లావాదేవీలను ఫిబ్రవరిలో నమోదు చేసింది. దీని తర్వాతి స్థానాల్లో హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకులున్నాయి. ఇక పేటీఎం పేమెంట్స్ బ్యాంకు, ఫోన్‌పే కూడా పలు విభాగాల్లో అగ్రగామిగా నిలిచాయి. తాజాగా నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఈ వివరాలను తెలియజేసింది. యూపీఐ ప్లాట్ ఫామ్‌పై యాప్ ఆధారిత లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్‌ల విలువ పరంగా ఫోన్‌పే మొదటి స్థానంలో నిలిచింది. యాప్ విభాగంలో ఫోన్ ద్వారా ఏకంగా 975.53 మిలియన్ యూపీఐ లావాదేవీలు జరిగాయి. ఇదిలా ఉంటే లావాదేవీల కోసం భీమ్ యాప్‌ను ఉపయోగించే వారు తమ పెండింగ్ ట్రాన్సాక్షన్స్ వివరాలను తెలుసుకోవడంతో పాటు, ఫిర్యాదులను దాఖలు చేసుకోవచ్చని నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ తెలిపింది. వినియోగదారులకు ఫిర్యాదుల విషయంలో పారదర్శకత ఉండాలనే ఆర్‌బీఐ విధానంలో భాగంగానే ఈ సదుపాయం తీసుకొచ్చినట్లు తెలిపారు. భీమ్ యూపీఐ యాప్‌పై యూపీఐ–హెల్ప్ ఆప్షన్ నుంచి ఈ సదుపాయాలను పొందొచ్చని తెలిపింది.
Also Read: Amazon Kids Carnival: అమెజాన్ బంపర్ ఆఫర్.. ప్రత్యేక ఆఫర్లతో కిడ్స్ కార్నివాల్ సేల్ ప్రారంభం