రాష్ట్రాలకు పెట్రోల్‌పై(Petrol) వ్యాట్ (VAT )తగ్గించే వెసులుబాటు ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(SBI) తాజా రివ్యూ రిపోర్ట్‌లో వెల్లడించింది. ప్రజలపై ధరల భారాన్ని తగ్గించడంలో భాగంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన సంగతి తెలిసిందే. అదే బాటలో కొన్ని రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గించాయి. అయితే.. మిగిలిన కొన్ని రాష్ట్రాలు మాత్రం అలా చేయలేదు.. దీంతో ఆయా రాష్ట్రాల్లో కూడా తగ్గించాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. తాజాగా విడుదలైన ఎస్‌బీఐ నివేదిక సైతం అదే విషయాన్ని వెల్లడించింది. వ్యాట్‌ను తగ్గించేందుకు రాష్ట్రాలకు వెసులుబాటు ఉందని తన విశ్లేషనాత్మాక రిపోర్టులో పేర్కొంది. ఇటీవల చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో వ్యాట్ రూపంలో రాష్ట్రాలు రూ.49,229 కోట్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకున్నాయని ఎస్‌బీఐ తాజా నివేదిక తెలిపింది. కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించడం వల్ల రూ.15,021 ఆదాయాన్ని కోల్పోయాయని పేర్కొంది. అయినా, రాష్ట్రాలకు ఇంకా రూ.34,208 కోట్ల అదనపు ఆదాయం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో వ్యాట్‌ను తగ్గించే వెసులుబాటు రాష్ట్రాలకు ఉందని స్పష్టం చేసింది.
చమురు ధరలపైనే వ్యాట్ ఆదాయం ఆధారపడి ఉంటుందని వెల్లడించింది. ధరలు పెరిగితే ఆదాయం పెరుగుతుంది.. ఒకవేళ చమురు ధరలు తగ్గితే ఆదాయం కూడా తగ్గుతుంది. ఇటీవల కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించిన నేపథ్యంలో ధరలు తగ్గి వ్యాట్ ఆదాయంలో కూడా బ్రేక్ పడింది. అయితే.. ఇటీవలి ధరల పెరుగుదల వల్ల వ్యాట్ ఆదాయం రూపంలో మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ అత్యధికంగా లబ్ధిపొందాయని తన నివేదిక పేర్కొంది.
కరోనా సంక్షోభం సమయం తర్వాత రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా గాడినపడుతోందని నివేదికలో ఎస్‌బీఐ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్యకాంతి ఘోష్ పేర్కొన్నారు. దీంతో రాష్ట్రాలు రుణ సమీకరణకు కూడా తగ్గించుకున్నాయని రిపోర్టులో వెల్లడించారు. దీంతో ట్యాక్సులను తగ్గించడానికి రాష్ట్రాలకు అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. లీటర్ డీజిల్‌పై రూ.2, పెట్రోల్‌పై రూ.3 తగ్గించేందుకు రాష్ట్రాలకు వెసులుబాటు ఉందని అభిప్రాయపడ్డారు.
జీడీపీలో అప్పుల వాటా తక్కువగా ఉన్న మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాలు పెట్రోల్‌పై రూ.5 వరకు తగ్గించేందుకు ఛాన్స్ ఉందని సౌమ్యకాంతి ఘోష్ తన నివేదికలో పేర్కొన్నారు. హరియాణా, మహారాష్ట్ర, రాజస్తాన్ తోపాటు తెలంగాణ రాష్ట్రాల జీడీపీలో పన్నుల వాటా 7 శాతంగా ఉందని తెలిపారు. కాబట్టి ఆయా రాష్ట్రాలు సైతం ఇంధనంపై ఉన్న పన్నులను తగ్గించొచ్చని అన్నారు.
అయితే.. పెట్రో ఉత్పత్తులపై పన్ను విషయంలో ముగింపు లేని ప్రశ్నలను తొలగించాలంటే వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం ఒక్కటే మార్గమని నివేదిక సూచించింది. అయితే, అలా చేయడం వల్ల కేంద్రం రూ.20,000 కోట్ల ఆదాయం కోల్పోతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సరైన పద్ధతిని రూపొందించి పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు.