ఫిక్స్‌డ్ డిపాజిట్.. ప్రజలకు అత్యంత చేరువైన సురక్షిత పెట్టుబడి పథకం. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతో పాటు పోస్ట్ ఆఫీసులో కూడా ఈ ఖాతా ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. అయితే బ్యాంకులతో పాటు వడ్డీ రేటు కూడా మారుతుంటుంది. కస్టమర్లను ఆకర్షించేందుకు బ్యాంకులు ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లపై ఆకర్షణీయమైన వడ్డీరేట్లతో స్కీమ్‌లను ప్రవేశపెడుతుంటాయి. అటువంటి స్కీమ్‌లలో అత్యంత ప్రజాదరణ పొందింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)వారి స్పెషల్ రిటైల్ టర్మ్ డిపాజిట్ స్కీం అమృత్ కలష్ డిపాజిట్. 2023, ఫిబ్రవరి 15న దీనిని ప్రవేశపెట్టగా.. దీనిలో చేరేందుకు గడువు 2023 మార్చి 31కే పూర్తయిపోయింది. అయితే ఈ స్కీమ్ మళ్లీ ప్రారంభిస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది. కేవలం 15 రోజుల వ్యవధిలోనే పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు చెప్పింది. ఈ మేరకు ఎస్‌బీఐ తన అధికారిక వెబ్ సైట్ లో ప్రకటించింది. ఇది ఏ విధంగా కస్టమర్లకు గుడ్ న్యూస్. అసలు ఏంటి ఈ పథకం. దీనిలో వచ్చే వడ్డీ ఎంత? ఇతర ప్రయోజనాలు ఏంటి? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఎస్బీఐ మళ్లీ తన స్పెషల్ రిటైల్ డిపాజిట్ పథకం అయిన అమృత్ కలష్ పథకాన్ని తిరిగి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఎస్‌బీఐ వెబ్‌సైట్ ప్రకారం.. ఏప్రిల్ 12 నుంచి ఈ ప్రత్యేక డిపాజిట్ స్కీం మళ్లీ అందుబాటులోకి వచ్చింది. ఈ 400 రోజుల స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్‌పై ఏప్రిల్ 12 నుంచి 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఇక సీనియర్ సిటిజెన్లు అదనంగా 50 బేసిస్ పాయింట్ల మేర లాభం పొందుతారు. ఈ లెక్కన వారికి 7.60 శాతం వడ్డీ అందుతుంది. ఇక ఈ స్కీంలో చేరేందుకు ఆఖరి తేదీ 2023, జూన్ 30 గా నిర్ణయించింది. అంటే.. మరో 2 నెలల సమయం మాత్రమే ఉంది. ఎస్‌బీఐ అందిస్తున్న ఈ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్‌లో చేరాలని భావించే వారు గరిష్టంగా రూ. 2 కోట్ల వరకు డబ్బులను దాచుకోవచ్చు. అమృత్ కలశ్ ఎఫ్‌డిపై ఆసక్తి ఉంటే సమీప ఎస్బీఐ బ్యాంకుల్లో తీసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ లేదా ఎస్బీఐ యోనో మొబైల్ యాప్ ద్వారా పొందవచ్చు. ఈ పథకంలో అవవరమైనప్పుడు డ్రా చేసుకునే విధంగా ప్రీ మెచ్యూర్ విత్ డ్రాయల్ సౌకర్యం కూడా ఉంది.
కొత్తగా ఎఫ్‌డీ అకౌంట్ తెరిచే వారు ఈ స్కీమ్‌లో చేరేందుకు అర్హులు. అలాగే ఫిక్స్‌డ్ డిపాజిట్లను రెన్యూవల్ చేసుకునే వారు కూడా ఈ పథకంలో చేరొచ్చు. ఎన్‌ఆర్‌ఐ రూపీ టర్మ్ డిపాజిట్స్‌కు కూడా అవకాశం ఉంటుంది. ఇది కొత్త డిపాజిట్లకు , రెన్యూవల్ డిపాజిట్లకు, టర్మ్ డిపాజిట్లకు , స్పెషల్ టర్మ్ డిపాజిట్లు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటు నెలవారీగా, 3 నెలలకు ఓసారి, 6 నెలలకు ఓసారి బ్యాంకు చెల్లిస్తుంది. ఇక ఎస్‌బీఐ సాధారణ వడ్డీ రేట్ల విషయానికి వస్తే.. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధి ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కనిష్టంగా 3 శాతం నుంచి గరిష్టంగా 7 శాతం వరకు వడ్డీ ఉంటుంది. ఇక సీనియర్ సిటిజెన్ల విషయానికి వస్తే 3.50 శాతం నుంచి 7.50 శాతం వరకు ఉంటుంది. ఇక ఎస్‌బీఐ వీ కేర్ డిపాజిట్ స్కీం కింద అదనంగా మరో 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ లభిస్తుంది. ఎస్‌బీఐ మరో స్పెషల్ డిపాజిట్ స్కీం సర్వోత్తమ్ ఎఫ్‌డీ కూడా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..