
స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా, దీర్ఘకాలంలో కోటీశ్వరులు కావాలనుకునే వారికి మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడూ ఒక వరం లాంటివే. దేశంలోని అతిపెద్ద ఫండ్ హౌస్ అయిన ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్‌కు చెందిన ఒక పాత పథకం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 35 ఏళ్ల క్రితం ఈ ఫండ్‌లో చిన్న పెట్టుబడి పెట్టిన వారి తలరాతే మారిపోయింది. ఎస్బీఐ అత్యంత పాత పథకాల్లో ఒకటైన SBI ESG ఎక్స్‌క్లూషనరీ స్ట్రాటజీ ఫండ్ సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇది జనవరి 1, 1991లో ప్రారంభమైంది. ప్రారంభం నుండి సగటున ఏడాదికి 14.12శాతం రాబడిని ఇచ్చింది. 1991లో ఎవరైనా ఈ ఫండ్‌లో కేవలం రూ. 10,000 ఏకమొత్తంగా పెట్టుబడి పెట్టి ఉంటే, ఫిబ్రవరి 2026 నాటికి దాని విలువ అక్షరాలా రూ. 10,31,930.. అంటే పెట్టుబడిపై దాదాపు 100 రెట్ల లాభం లభించింది.
ఈ ఫండ్ కేవలం లాభాల కోసమే కాకుండా పర్యావరణ, సామాజిక బాధ్యత కలిగిన దిగ్గజ కంపెనీలలో పెట్టుబడి పెడుతుంది. దీని పోర్ట్‌ఫోలియోలో ప్రధానంగా..
బ్యాంకింగ్: HDFC బ్యాంక్ (9.08శాతం), ICICI బ్యాంక్ (8.33శాతం), SBI (5.04శాతం).
టెక్నాలజీ: ఇన్ఫోసిస్ (6.27శాతం).
రంగాలు: ఆర్థిక సేవలు (36.5శాతం), ఆటోమొబైల్స్ (11.13శాతం), ఐటీ (10.13శాతం).
మ్యూచువల్ ఫండ్ నిపుణుల ప్రకారం.. ఈ ఫండ్ రాబడి అద్భుతంగా ఉన్నప్పటికీ, దీని రిస్క్ మీటర్ చాలా ఎక్కువ సూచిస్తోంది. అంటే మార్కెట్ ఒడిదుడుకులు ఈ ఫండ్‌పై ప్రభావం చూపుతాయి. దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్నవారికి మాత్రమే ఇది అనుకూలం. ఓపికతో దీర్ఘకాలం పెట్టుబడి పెడితే మార్కెట్ ఎలా సంపదను సృష్టిస్తుందో చెప్పడానికి ఈ ఎస్బీఐ ఫండ్ ఒక చక్కని ఉదాహరణ.