SBI-FabIndia Co Branded Credit Cards: మీకు ఎస్బీఐలో అకౌంట్ ఉందా ? అయితే ఈ విషయం మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. దేశీయ దిగ్గజ ప్రభుత్వం రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు శుభవార్త అందించింది. కొత్త క్రెడిట్ కార్డును అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోని క్రెడిట్ కార్డు కంపెనీల్లో ఒక్కటైన ఎస్బీఐ.. లైఫ్ స్టైల్ రిటైల్ చెయిన్ ఫ్యాబ్ ఇండియాతో కలిసి ఈ కొత్త క్రెడిట్ కార్డు అందుబాటులోకి తెచ్చింది.
అంటే ఇది కో బ్రాండెడ్ కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డు. దీనిని తీసుకోవడం వలన రూ. 1500 విలువైన గిప్ట్ వోచర్ కూడా పొందవచ్చు. అంతేకాకుండా.. రివార్డ్ పాయింట్లు కూడా పొందవచ్చు. ఈ కార్డు ప్రీమియం సెగ్మెట్ కస్టమర్లు లక్ష్యంగా ఎస్బీఐ ఆవిష్కరించింది. ఈ కార్డు వలన కలిగే ప్రయోజనాలు ఎంటో తెలుసుకుందామా. ఇందులో మూడు నెలలకు రూ. 2 లక్షలకు పైన ఖర్చు చేస్తే.. రూ. 1250 గిఫ్ట్ వోచర్ వస్తుంది. అలాగే ఫ్యూయెల్ సర్ చార్జ్ ఫెసిలిటీ కూడా ఉంది. అలాగే సంవత్సరంలో రూ. 75 వేలు ఖర్చు చేస్తే ఫ్యాబ్ ఫ్యామిలీ లాయల్టీ ప్రోగ్రామ్ ప్లాటినమ్ టైర్ యాక్సెస్ లభిస్తుంది. అంతేకాకుండా.. ఫ్యాబ్ ఇండియా స్టోర్ లో ఖర్చు చేసే ప్రతి రూ.100 కు 10 రివార్డు పాయింట్లు వస్తాయి. ఇతర ఖర్చులపై ప్రతి రూ.100 ఖర్చుపై 2 నుంచి 3 పాయింట్లు లభిస్తాయి.
ఎస్బీఐ కార్డ్ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామా మోహన్ రావు అమరా మాట్లాడుతూ.. “మా వినియోగదారులకు ఉత్తమమైన ఇన్-క్లాస్ ఉత్పత్తులు, సేవలు, సాటిలేని అనుభవాన్ని తీసుకురావడమే ఎస్బీఐ ప్రయత్నం. మనకు మరో శక్తివంతమైన, ప్రత్యేక వ్యాల్యూ ప్రతిపాదనను తీసుకురావడానికి ఫ్యాబ్ ఇండియాను భాగస్వాములుగా చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఈ ఫ్యాబ్ ఇండియా ఎస్బీఐ కార్డ్ లాంచ్ చేయడం వలన మా ప్రీమియం వ్యవస్థను మరింత బలపరుస్తుంది. వినియోగ దారులు డిజిటల్ చెల్లింపులను స్వీకరించడానికి దేశీయ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మరింత దోహదపడటానికి మా నిబద్ధతను మరింత బలపరుస్తుంది” అన్నారు.