కష్టకాలం ముందుంది.. కానీ వాళ్లకు కలిసి రావొచ్చు! రాబర్ట్‌ కియోసాకి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

ప్రపంచవ్యాప్తంగా భారీ ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉందని ప్రముఖ ఇన్వెస్టర్‌ రాబర్ట్‌ కియోసాకి హెచ్చరించారు. మార్కెట్‌ పతనం నేపథ్యంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి పెట్టుబడులు పెట్టేవారే నిజమైన ఇన్వెస్టర్లని సూచించారు.

కష్టకాలం ముందుంది.. కానీ వాళ్లకు కలిసి రావొచ్చు! రాబర్ట్‌ కియోసాకి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌
Robert Kiyosaki Gold Silver

Updated on: May 24, 2026 | 10:22 AM

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ ఇన్వెస్టర్‌, రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌ రచయిత రాబర్ట్‌ కియోసాకి. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా భారీ ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని, ఆ ప్రభావంతో స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశముందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు సోషల్‌మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ మదుపర్లలో చర్చనీయాంశంగా మారాయి. ఆర్థిక మార్కెట్లు కుదేలయ్యే పరిస్థితి ఏర్పడితే బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు ఊహించని స్థాయికి చేరుకుంటాయని కియోసాకి అభిప్రాయపడ్డారు. ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు జిమ్ రికార్డ్స్ అంచనాలను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ బంగారం ధర సుమారు 4,500 డాలర్ల వద్ద ఉండగా, భవిష్యత్తులో అది ఏకంగా 1,00,000 డాలర్ల వరకు పెరిగే అవకాశముందని జిమ్‌ రిచర్డ్స్‌ పేర్కొన్నట్లు కియోసాకి తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం ఔన్స్‌ వెండి ధర సుమారు 75 డాలర్లుగా ఉండగా, రాబోయే రోజుల్లో అది 200 డాలర్ల స్థాయిని తాకవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి, దానికి అనుగుణంగా పెట్టుబడులు పెట్టేవారే నిజమైన ఇన్వెస్టర్లు అని కియోసాకి పేర్కొన్నారు. రాబోయే ఆర్థిక సంక్షోభాన్ని కేవలం ప్రమాదంగా కాకుండా అవకాశంగా కూడా చూడాలని ఆయన సూచించారు. సరైన సమయంలో సరైన ఆస్తుల్లో పెట్టుబడి పెడితే సంక్షోభ సమయంలోనూ సంపదను పెంచుకోవచ్చని తెలిపారు.

ఆర్థిక అస్థిరత, ద్రవ్యోల్బణం, జియోపాలిటికల్‌ ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో పెట్టుబడిదారులు సాధారణంగా సురక్షిత పెట్టుబడులుగా భావించే బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతారు. ఈ నేపథ్యంలో కియోసాకి చేసిన వ్యాఖ్యలు గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్లలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే నిపుణులు మాత్రం ఇలాంటి అంచనాలను జాగ్రత్తగా విశ్లేషించి, పెట్టుబడిదారులు తమ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్‌ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us