Software Exports: పెరిగిన భారత సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు.. ఆర్బీఐ తాజా నివేదిక..

|

Oct 22, 2024 | 1:24 PM

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎనేబుల్డ్‌ సర్వీసెస్‌ (ఐటీఈఎస్‌) ఐటీ ఎగుమతులకు సంబంధించి వార్షిక సర్వేను విడుదల చేసింది. ఇందులో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. భారత సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు పెరిగినట్లు నివేదికలో వెల్లడైంది. గతేడాదితో పోల్చితే ఎగుమతులు పెరిగినట్లు తేలింది..

Software Exports: పెరిగిన భారత సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు.. ఆర్బీఐ తాజా నివేదిక..
Software Exports
Follow us on

భారత సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు పెరుగుతున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎనేబుల్డ్‌ సర్వీసెస్‌ (ఐటీఈఎస్‌) ఐటీ ఎగుమతులకు సంబంధించి వార్సిక సర్వే 2023-24 డేటాను విడుదల చేసింది. సర్వేలో భాగంగా మొత్తం 7226 సాఫ్ట్‌వేర్‌ ఎగుమతి కంపెనీలను సంప్రదించారు. భారత్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు 2023-24లో 2.8 శతం పెరిగి 190.7 బిలియన్ల యూఎస్‌ డాలర్లకు చేరుకున్నాయని ఆర్‌బీఐ తెలిపింది.

గతేడాదితో పోల్చితే ఐటీ ఎగుమతుల పెరగడం విశేషం. భారత కంపెనీలు అధికంగా అమెరికాకు ఈ సేవలను ఎగుమతి చేస్తున్నాయి. మొత్తం భారత కంపెనీల ఎగుమతుల్లో అమెరికా వాటా 53 శాతం కాగా, యూరప్‌ వాటా 31 శాతంగా ఉంది. ఇక ఐటీ ఎగుమతుల్లో మెజారిటీ బీపీఓ సేవలు ఉన్నాయి. పబ్లిక్‌ లిమిటెడ్ కంపెనీలతో పోల్చితే సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో ప్రవేట్‌ లిమిట్‌ కంపెనీలు ఎక్కువ వృద్ధిని నమోదు చేశాయి.

సాఫ్ట్‌వేర్‌ సేవల మొత్తం ఎగుమతుల్లో 90 శాతం ఆఫ్‌ సైట్ సేవలు ఉన్నాయి. పదేళ్ల క్రితం ఈ వాటా 80 శాతంగా ఉండగా ప్రస్తుతం 10 శాతం పెరిగాయి. భారతీయ కంపెనీలకు చెందిన విదేశీ అనుబంధ సంస్థలు అందించే సేవలతో సహా సాఫ్ట్‌వేర్‌ సేవలు మొత్తం ఎగుమతులు 2023-24లో 205.2 బిలియన్ల యూఎస్ డాలర్లకు పెరిగింది. గతేడాది ఇది 200.06 బిలియన్ల డాలర్లుగా ఉంది. వీటిలో అమెరికా, యూకే ప్రధాన గమ్యస్థానాలుగా ఉన్నాయి.

ఇదిలా ఉంటే రానున్న రోజుల్లో సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి వాతావరణం, భౌగోళిక అస్థిరతల వల్ల బ్యాంకింగ్‌ రంగ సంస్థలతో పాటు.. ఇతర కంపెనీలు సాఫ్ట్‌వేర్‌ సేవలను అప్‌డేట్‌ చేయడంలో కొంత వెనుకంజ వేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ద్రవ్యోల్బణం రేటు కొంత స్థిరంగా కొనసాగుతోంది. దీంతో సెంట్రల్ బ్యాంకులు కీలక వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి. ఈ కారణంగానే లోన్లు పెరిగే అవకాశం ఉందని. ఇది బ్యాంకింగ్‌ రంగ సంస్థలు తమ సాఫ్ట్‌వేర్‌ కేటాయింపులకు నిధులు పెంచేందుకు దారి తీస్తాయని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ రంగంలో ఐటీ సేవల ఎగుమతి పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..