వచ్చే ఏడాది మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు.. ఆర్బీఐ సరికొత్త పైలట్ ప్రాజెక్ట్!

నేటి డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ చెల్లింపులు పెరిగినప్పటికీ, సాంకేతిక సమస్యల వల్ల చాలా మంది ఇప్పటికీ తమ పర్సులలో కొంత నగదును ఉంచుకుంటున్నారు. ముఖ్యంగా రోజువారీ అవసరాలకు రూ. 10, రూ. 20 నోట్లు ఎక్కువగా ఉపయోగపడతాయి. అయితే, త్వరలోనే మీ జేబులోని ఈ రూ. 10, రూ. 20 నోట్ల రూపం మారిపోనుంది. సాధారణ నోట్లకు బదులుగా ప్లాస్టిక్ నోట్లు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన ఒక పైలట్ ప్రాజెక్ట్ పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రస్తుతం కసరత్తు చేస్తోంది.

వచ్చే ఏడాది మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు.. ఆర్బీఐ సరికొత్త పైలట్ ప్రాజెక్ట్!
Rbi Plastic Notes

Updated on: Jul 18, 2026 | 6:51 PM

మారుతున్న కాలానికి అనుగుణంగా భారత బ్యాంకింగ్ రంగంలో డిజిటల్ విప్లవం దూసుకుపోతున్నప్పటికీ, సామాన్యుడి దైనందిన అవసరాల్లో నగదు పాత్ర ఇంకా చెక్కుచెదరలేదు. ముఖ్యంగా రూ. 10, రూ. 20 వంటి చిన్న నోట్లను ప్రజలు విరివిగా ఉపయోగిస్తుంటారు. అయితే, ఈ చిన్న నోట్లు చేతులు మారుతున్న కొద్దీ త్వరగా మురికిగా మారడం, చిరిగిపోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వచ్చే ఏడాది నుండి ఒక ప్రతిష్టాత్మక పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా రూ. 10, రూ. 20 కరెన్సీ నోట్లను ప్లాస్టిక్ రూపంలో ప్రయోగాత్మకంగా విడుదల చేయనున్నారు.

కాటన్ పేపర్ స్థానంలో పాలిమర్ షీట్లు:

ప్రస్తుతం మనం వాడుతున్న నోట్లు కాగితంతో చేసినవిగా అనిపించినా, అవి 100 శాతం కాటన్ పల్ప్‌తో తయారవుతాయి. ఇవి తేమకు, చెమటకు త్వరగా పాడైపోతాయి. వీటికి బదులుగా ఆర్బీఐ తీసుకురానున్న కొత్త నోట్లను ప్రత్యేక రసాయన ప్రక్రియతో రూపొందించిన పాలిమర్ సబ్‌స్ట్రేట్ షీట్లపై ముద్రిస్తారు. ఈ నోట్లు ప్లాస్టిక్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల సాధారణ నోట్ల కంటే అనేక రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి.

ప్రస్తుత నోట్ల ముద్రణ ఖర్చు ఎంత?:

సాధారణంగా ప్రజలు మనం వాడే నోట్లను కాగితంతో చేసినవి అనుకుంటారు. కానీ, అవి 100 శాతం కాటన్ తో తయారవుతాయి. సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా అందిన వివరాల ప్రకారం, ఈ సాధారణ నోట్ల ముద్రణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

10 రూపాయల నోటు: ఒక్కో నోటు ముద్రణకు దాదాపు 70 పైసల నుండి రూ. 1.01 వరకు ఖర్చవుతుంది.

20 రూపాయల నోటు: ఒక్కో నోటు ముద్రణకు దాదాపు 95 పైసల నుండి రూ. 1 వరకు అవుతుంది.

ప్లాస్టిక్ నోట్ల ముద్రణ ఎంత ఖరీదైనది? ప్రభుత్వానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి?:

సాధారణ నోట్ల ముద్రణతో పోలిస్తే ప్లాస్టిక్ నోట్ల ప్రారంభ ముద్రణ ఖర్చు కొంత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత పేపర్ నోటుకు ఒక రూపాయి లోపు ఖర్చవుతుంటే, ప్లాస్టిక్ నోటుకు రూ. 2 నుండి రూ. 6 వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ దీర్ఘకాలంలో ఇది ప్రభుత్వానికి ఎంతో లాభదాయకం. పాలిమర్ నోట్లు నీటిలో నానినా పాడవు, మురికి అంటదు, వాటిని చింపడం చాలా కష్టం. దీనివల్ల మార్కెట్లోకి పదే పదే కొత్త నోట్లను ముద్రించి పంపాల్సిన అవసరం తగ్గి, ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల రూపాయల ముద్రణ వ్యయం ఆదా అవుతుంది.

అధునాతన సెక్యూరిటీ ఫీచర్లు – కఠిన నిబంధనలు:

ఈ కొత్త ప్లాస్టిక్ నోట్లలో నకిలీలను అరికట్టడానికి అత్యంత అధునాతన సెక్యూరిటీ ఫీచర్లను చేర్చనున్నారు. ఇందులో పారదర్శకమైన విండోతో కూడిన పోర్ట్రెయిట్, మెటాలిక్ న్యూమరల్స్, మ్యాగ్నెటిక్ సూడో థ్రెడ్, షాడో ఇమేజ్ వంటి ఫీచర్లు ఉంటాయి.

అయితే, జాతీయ భద్రత దృష్ట్యా ఆర్బీఐ ఈ టెండర్లలో కఠినమైన నిబంధనలను విధించింది. బిడ్ దాఖలు చేసే కంపెనీలకు చైనా లేదా పాకిస్తాన్‌లతో ఎలాంటి వ్యాపార, సిబ్బంది సంబంధాలు ఉండకూడదు. ఆయా దేశాల నుండి ముడిసరుకును సేకరించకూడదు. భారతదేశంతో సరిహద్దు పంచుకునే దేశాల కంపెనీలు కచ్చితంగా DPIIT రిజిస్ట్రేషన్ కమిటీలో నమోదై ఉండాలి. అంతేకాకుండా, సరఫరా చేసే పాలిమర్ షీట్లలో జంతువుల కొవ్వు (Animal Tallow) లేదా DNA కంటెంట్ ఏమీ లేదని ల్యాబొరేటరీ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన ప్రయోగం:

ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే పాలిమర్ నోట్లను విజయవంతంగా ఉపయోగిస్తున్నాయి. ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా వంటి దేశాల్లో ఈ ప్లాస్టిక్ కరెన్సీ ఎంతో కాలంగా చలామణిలో ఉంది. భారతదేశంలో కూడా వాతావరణ పరిస్థితులు, ప్రజల వినియోగ తీరును బట్టి ఈ నోట్లు ఎంతవరకు తట్టుకోగలవనేది పరిశీలించడానికి ఆర్బీఐ మొదట ఎంపిక చేసిన కొన్ని నగరాల్లో ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను నిర్వహించనుంది. అక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నోట్లను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us